Vasantha Panchami 2025 : వసంత పంచమి వేడుకలు - తెలంగాణలోని సరస్వతిదేవి ఆలయాలకు భక్తుల తాకిడి
వసంత పంచమి వేడుకలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం సిద్ధమయ్యింది. మహాసరస్వతి అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసానికి, పుస్తక పూజలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తుల తాకిడి మొదలైంది. మరోవైపు సిద్ధిపేట జిల్లాలోని వర్గల్ సరస్వతి ఆలయంలోనూ భక్తుల రద్దీ పెరిగింది.
కరీంనగర్ లోని చైతన్యపురిలో గల మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల దివ్య క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగుబంగారంగా మారిన ఇక్కడి శ్రీ మహాసరస్వతి అమ్మవారి కోవెలలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి ఆశీస్సులతో ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం రోజున వసంత పంచమి సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.
భారీగా తరలిరానున్న భక్తులు...
శ్రీమహాదుర్గ, శ్రీమహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కలిసి ఒకే క్షేత్రంలో ఉండడంవల్ల భారీగా భక్తులు తరలిరానున్నారు. గత ఏడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య పెరుగనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
దేవాలయ ప్రాంగణం పూలతో అలంకరించారు. అమ్మవార్లను కూడా ప్రత్యేకంగా అలంకరించనున్నారు. భక్తులకు సరిపడా అమ్మవారి ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. చదువుల తల్లి సరస్వతి దేవి వసంత పంచమి రోజునే జన్మించిందని వివరించారు. అక్షరానికి అది దేవతైన సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలన్నారు.
వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చని శ్రీమహాశక్తి దేవాలయ అర్చకులు తెలిపారు. వసంత పంచమి వేడుకల సందర్భంగా దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.
కార్యక్రమాల వివరాలు….
▪️ఉదయం 4 గంటలకు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల మూల మూర్తులకు అభిషేకం.
▪️ఉదయం 7 గంటలకు శ్రీ మహాసరస్వతి దేవి పూజ, అభిషేకం, కుంకుమార్చన.
▪️ఉదయం 8 గంటల నుండి విద్యార్థులచే సామూహిక పుస్తక పూజలు, అక్షర స్వీకారములను చేపట్టనున్నారు.
వర్గల్ సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ:
సిద్దిపేట జిల్లాలోని వర్గల్ శ్రీవిద్యా సరస్వతి శనైశ్వరాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.ఉదయం నుంచే అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. చుట్టపక్కల ఉన్న జిల్లాల నుంచి భక్తుల తరలివస్తుండటంతో… ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రేపు (ఫిబ్రవరి 3) వసంత పంచమి సందర్భంగా భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం