Karimnagar Politics: విభేదాలు విడిచి, విమర్శలు లేకుండా... కరీంనగర్ లో రాజకీయ ప్రత్యర్ధుల అభివృద్ధి మంత్రం-development politics political opponents in karimnagar are following the development line ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Politics: విభేదాలు విడిచి, విమర్శలు లేకుండా... కరీంనగర్ లో రాజకీయ ప్రత్యర్ధుల అభివృద్ధి మంత్రం

Karimnagar Politics: విభేదాలు విడిచి, విమర్శలు లేకుండా... కరీంనగర్ లో రాజకీయ ప్రత్యర్ధుల అభివృద్ధి మంత్రం

HT Telugu Desk HT Telugu
Jan 24, 2025 06:47 AM IST

Karimnagar Politics: కరీంనగర్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ ప్రత్యర్థులు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. ఉప్పు నిప్పులా ఉండే మూడు ప్రధాన పార్టీల ప్రజాప్రతినిధులు ఐక్యంగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు.

గంగులతో ప్రారంభోత్సవం చేయిస్తున్న బండి సంజయ్
గంగులతో ప్రారంభోత్సవం చేయిస్తున్న బండి సంజయ్

Karimnagar Politics: కరీంనగర్ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. పార్టీలు, జెండాలు వేరైనా అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటేనని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నగరంలో చేపట్టిన సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రెండు రోజుల పాటు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

yearly horoscope entry point

నగరపాలక సంస్థలో బిఆర్ఎస్ అధికారంలో ఉండగా కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో మూడు పార్టీలు కలిసి ప్రారంభోత్సవాలు చేస్తున్నాయి. అయితే ఈనెల 29తో నగరపాలక సంస్థ పాలకవర్గం పదవి కాలం ముగుస్తుండడంతో వారికి అవకాశం లేకుండా చేసేందుకు నగర కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పనులను వాయిదా వేయాలని, రాష్ట్ర మంత్రులు రావద్దని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తిని రాష్ట్రం మంత్రులు పక్కన పెట్టి ప్రారంభోత్సవాలకు హాజరవుతుండడంతో కాంగ్రెస్ లో అంతర్గత విబేధాలు, గ్రూప్ రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి. వర్గ పోరుతో కాంగ్రెస్ నేతలు రగిలిపోతుంటే, అభివృద్ధి పనులను ఓన్ చేసుకునేందుకు బిఆర్ఎస్ బిజెపి పోటీ పడుతు నగరాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. కాంగ్రెస్ శ్రేణులు నేతల వైఖరితో ఆందోళన చెందుతున్నారు.

గంగులతో రిబ్బన్ కట్ చేయించిన బండి సంజయ్...

కరీంనగర్ లో అరుదైన రాజకీయం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలిసి కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్మార్ట్ సిటీ లో భాగంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రాజీవ్ పార్క్, వీది వ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా గంగుల కమలాకర్ కు కత్తెర ఇచ్చి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రిబ్బన్ కట్ చేయించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి....కానీ చేసిన అభివృద్ధే శాశ్వతంగా నిలిచిపోతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇకపై తాను రాజకీయ విమర్శలు చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు.

జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్దే లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానన్నారు. వరంగల్ కు ధీటుగా కరీంనగర్ ను అభివృద్ధి చేసుకుంటున్నామని, కేంద్రం నుండి నిధులు తీసుకురావడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటామని తెలిపారు.

కరీంనగర్ కు కట్టర్ రాక...

కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ కరీంనగర్ లో శుక్రవారం పర్యటిస్తారు. ఉదయం 10.30 గంటలకు కరీంనగర్ కు రానున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో కలిసి రూ.8.2 కోట్లతో మల్టీపర్సస్ స్కూల్ లో చేపట్టిన పార్క్ పనులను ప్రారంభిస్తారు.

అక్కడి నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం వద్ద రూ.22 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, అనుబంధ పనులను ప్రారంభిస్తారు. అనంతరం హౌజింగ్ బోర్డు కాలనీ పరిధిలో 24/7 నిరంతరాయంగా మంచి నీళ్లను సరఫరా చేసే చారిత్రక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కుమ్మర్ వాడి హైస్కూల్ కు చేరుకుని స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూంను ఆరంభిస్తారు. అనంతరం హౌజింగ్ బోర్డు కాలనీలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. డంపింగ్ యార్డ్ ను పరిశీలించి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి నగరం...

తెలుగు రాష్ట్రాల్లోనే‌ 24 గంటలు నిరంతరాయంగా వాటర్ సప్లై చేసే నగరంగా కరీంనగర్ రికార్డుకు ఎక్కనుంది. పైలెట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టిన నిరంతరాయంగా వాటర్ సప్లై స్కీం ను ప్రయోగాత్మకంగా నగరంలోని ఐదు డివిజన్లలో శుక్రవారం కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తున్నారు. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఇళ్లకు 365 రోజులపాటు తాగునీటిని అందించిన ఘనత కరీంనగర్ కార్పొరేషన్ కు దక్కబోతోంది.

పైలెట్ ప్రాజెక్ట్ క్రింద 4500 ఇళ్ళకు వాటర్ సప్లై చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టారు. ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వాటర్ ట్యాంక్ ద్వారా 2,660 ఇండ్లకు ప్రతిరోజు 24 గంటలపాటు తాగునీటిని సరఫరాను ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలోని ఒకటి, రెండు పట్టణాల్లో మాత్రమే 24 గంటలపాటు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏ పట్టణంలోనూ 24 గంటలపాటు నిరంతరాయంగా మంచి నీటిని సరఫరా చేస్తున్న దాఖలాల్లేవు. కరీంనగర్ ఆ రికార్డును సాధించబోతోంది.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner