CM KCR : పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ - సీఎం కేసీఆర్-devarakadra cm kcr public meeting criticized congress cause for palamuru situation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ - సీఎం కేసీఆర్

CM KCR : పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ - సీఎం కేసీఆర్

Bandaru Satyaprasad HT Telugu
Nov 06, 2023 05:48 PM IST

CM KCR : పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కృష్ణా, తుంగ‌భ‌ద్ర న‌దులు పారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టించే గ‌తి ప‌ట్టించింది కాంగ్రెస్ అని ఆరోపించారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

CM KCR : తెలంగాణ కోసం పులిబిడ్డల్లా కొట్లాడితే అప్పుడు కేంద్రం దిగొచ్చి ప్రకటన చేసి, మళ్లీ వెనక్కి తీసుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ప్రజా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న కేసీఆర్...ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుందని, అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచన చేసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. గత పాలకులు పాలమూరు జిల్లాను గబ్బు పట్టించారని విమర్శించారు. పాలమూరును వలసల ప్రాంతంగా చేశారని, పాలమూరు గడ్డు పరిస్థితులకు కాంగ్రెస్‌ కారణం కాదా? సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

వలసల పాలమూరు చేసిండ్రు

పాల‌మూరు ఒక‌ప్పుడు పాలుగారిన జిల్లా అని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి జిల్లాను స‌మైక్య రాష్ట్రంలో ఘోర‌మైన గ‌తి ప‌ట్టించారని ఆరోపించారు. నాటి సీఎంలు దత్తత పేరుతో పునాది రాళ్లు వేశారు త‌ప్ప, కొన్ని నీళ్లు తెచ్చివ్వలేదన్నారు. పంట‌లు ఎండిపోయి బ‌త‌క‌పోక బొంబాయి వలసలు వెళ్లేవారన్నారు. అలాంటి పాల‌మూరు జిల్లాను బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకి వలసలు ఆగాయన్నారు. కృష్ణా, తుంగ‌భ‌ద్ర న‌దులు పారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టించే గ‌తి ప‌ట్టించింది కాంగ్రెస్ అని ఆరోపించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా 50 ఏండ్ల పాటు తీవ్ర క‌రవు అనుభ‌వించడానికి కార‌ణం కాంగ్రెస్ పార్టీ అన్నారు.

ఆంధ్రలో కలిపి ప్రాజెక్టులు రద్దు

ఉన్న తెలంగాణ‌ను ఆంధ్రలో కలిపి ప్రాజెక్టుల‌ను ర‌ద్దు చేశారని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు కేసీఆర్. బ‌చ‌వాత్ ట్రిబ్యున‌ల్ 1974లో నీళ్ల పంప‌కం చేస్తే ఏ మంత్రి, ఎమ్మెల్యే కూడా పాలమూరు కోసం నీళ్లు అడ‌గ‌లేదన్నారు. పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని కేసీఆర్ మండిపడ్డారు. 2004లో తెలంగాణలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని అధికారంలోకి రాగానే నాన్చివేత ధోరణి పెట్టిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎట్లా చెబితే అట్లా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను ముంచే కార్యక్రమం చేసిందన్నారు. మన ఎమ్మెల్యేలను కొనే కార్యక్రమం చేశారని ఆరోపించారు. ఉద్యమాన్ని పెడదారి పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు.

14 ఏళ్ల పోరాటం

"కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడోనని మొండి పట్టుదలతో 14 సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను ఆమరణ నిరాహారదీక్ష పడితే తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటన చేసింది. మళ్లీ తెలంగాణ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లడం వల్ల.. మరో ఏడాదిపాటు వందలాది మంది పిల్లలు చనిపోయారు. ఉద్యమం తీవ్రం చేశాక గతిలేక, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వక తప్పలేదు. దేశంలోని 33 పార్టీల మద్దతు కూడగడితే 14 ఏండ్ల తర్వాత తెలంగాణ ఇచ్చారు తప్ప ఉత్తిగనే ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన పదేండ్లలో నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు పట్టుబట్టి పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేలా పనిచేశారు."- కేసీఆర్