రథసప్తమి రోజున శ్రీమన్నారాయణ మంత్రంతో మార్మోగిన ముచ్చింతల్ క్షేత్రం
ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. 216 అడుగుల శ్రీరామానుజుల విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం రోజు యాగశాలలో ఐశ్వర్యప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి, సంతాన ప్రాప్తికై వైనతేయ ఇష్టి కార్యక్రమాలు ప్రత్యేకంగా జరగనున్నాయి.
Hyderabad | శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం అత్యంత వైభవంగా జరుగుతోంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో మార్మోగుతుంది. 216 అడుగుల శ్రీరామానుజుల విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఏడో రోజు శ్రీరామనగరంలో రథ సప్తమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, ఆదిత్య హృదయ సామూహిక పారాయణం చేశారు.
మంగళవారం రోజు యాగశాలలో దుష్టగ్రహ బాధానివారణ, పాపవినాశనానికై శ్రీనారసింహ ఇష్టి అంగరంగ వైభవంగా జరిగింది. మహాక్రతువులో భాగంగా ఈరోజు పెరుమాళ్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చతుర్వేద పారాయణం జరిగింది. ఆపై శ్రీనారాసింహ అష్టోత్తర శతనామావళి పూజను అహోబిలం రామానుజ జీయర్ స్వామి నిర్వహించారు .
ధర్మాచార్య సదస్సు
శ్రీరామానుజుల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు ప్రవచన మండపంలో ధర్మాచార్య సదస్సును చిన్నజీయర్ స్వామి నిర్వహించారు. ఇందుకోసం దేశంలోని అన్నిప్రాంతాల నుంచి విచ్చేసిన 200 మందికి పైగా ధర్మాచార్యులు, స్వాములు, సాధుసంతుల సలహాలను కోరారు. ఈ ధర్మాచార్య సదస్సులో ప్రధానంగా నాలుగు అంశాలను చర్చించారు.
రామానుజాచార్యుల శ్రీమూర్తి లోకార్పణం చేశామన్న చిన్నజీయర్ స్వామీజీ.. సమతా సాధనకు కృషిచేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. దేశంలో కుల, మత, జాతి, వర్గాలను సమాజం నుంచి తొలగించాలంటే ఎలాంటి మార్గదర్శనం చేయాలో సూచనలివ్వాలన్నారు. ప్రతీ రంగంలో హెచ్చుతగ్గుల భావన నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు ఉత్తమమైన మార్గాన్ని అన్వేషించాని కోరారు. మానసిక ఉజ్జీవన, సమాజ ప్రగతికి ఎలాంటి సూచనలు చేయాలో ధర్మాచార్యులు తెలియజేయాలని చిన్నజీయర్ స్వామి కోరారు. ఇందుకోసం ప్రభుత్వాల నుంచి వివిధ రంగాల ప్రముఖుల నుంచి ఏ విధమైన సహకారం తీసుకోవాలో సూచించాలన్నారు. సనాతన ధర్మంలో స్వీయ ఆచారాలు చేసుకుంటూ పక్కవారి ఆచారాలను కూడా గౌరవిస్తూ సమాజ ప్రగతికి, అసమానతలను రూపు మాపేందుకు కృషిచేయాలన్నారు. ప్రాచీన వ్యవసాయక జీవన విధానాన్ని మెరుగుపర్చుకొని.. ప్రస్తుత జీవన విధానంలోకి ఉపయోగకరంగా మార్చుకోవాలన్నారు. బుధవారం కూడా ఈ ధర్మాచార్య సదస్సు జరగనుంది.
దేశం నలుమూలల నుంచి హాజరైన సాధుసంతులు
ఈరోజు జరిగిన ధార్మిక సదస్సుకు దేశం నలుమూలల నుంచి ఆచార్యులు, సాధు సంతులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 80 మంది స్వామీజీలు, పీఠాధిపతులు పాల్గొన్నారు. అలాగే ఉత్తర భారతదేశం నుంచి కూడా మరో 80 మంది స్వామీజీలు, సాధువులు, పీఠాధిపతులు హాజరయ్యారు. వీరిలో10 మంది మహా మండలేశ్వరులు ఉండటం విశేషం. బీహార్ నుంచి మహంత్ రామ్‌దేశ్‌జీ విచ్చేశారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కాశ్మీర్ సర్వజ్ఞ పీఠాధిపతి హాజరయ్యారు. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి కూడా సాధుసంతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక ఆర్‌ఎస్‌ఎస్ నుంచి సర్ సంఘ్‌చాలక్ బాగయ్య పాల్గొన్నారు. వీహెచ్‌పీ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ మిలింద్ పరాంజీ తదితరులు హాజరయ్యారు.
అలరించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ఈరోజు ప్రవచన మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆధ్యాత్మికవేత్త వీఎస్‌ఆర్ మూర్తి రామానుజ వైభవంపై ప్రవచనాన్ని అందించారు. సౌమిత్రి సిస్టర్స్ అంజలి, విష్ణుప్రియ ఆలపించిన రామానుజాచార్యుల గీతాలు ఆకట్టుకున్నాయి. నరసింహారావు, అద్దంకి శ్రీనివాస్, వెంకటాచర్యాలు మొదలగు వారు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. కుమారి మువ్వ ఆంధ్రనాట్యం, సుకన్యా రాజగోపాల్ బృందం వారి ఘటం, విజయానంద్ గానం అలరించాయి. సాయంత్రం వేళ విష్ణుసహస్ర పారాయణం చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది.
హజరైన వీఐపీ భక్తులు, తదుపరి రోజు కార్యక్రమాల సమాచారం
ఇవాళ శ్రీరామానుచార్యుల 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలతో పాటు తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సినీ ప్రముఖులు వి.వి. వినాయక్, రాజేంద్ర ప్రసాద్, దిల్ రాజు తదితరులు దర్శించుకున్నారు.
బుధవారం రోజు యాగశాలలో ఐశ్వర్యప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి, సంతాన ప్రాప్తికై వైనతేయ ఇష్టి కార్యక్రమాలు ప్రత్యేకంగా జరగనున్నాయి. రెండో రోజు ధర్మాచార్య సదస్సు కూడా జరగనుంది.
సంబంధిత కథనం