Red Chilli Price: ఎండు మిరప చూడు పిచ్చ ఘాటు.. రంకెలేసి ఎగిరింది దీని రేటు
Red Chilli Price: ఎండు మిరప క్వింటాలు ధర రూ. 81 వేలు పలికింది. డిసెంబరు 1న ప్రారంభమైన ఈ సీజన్‌లో ఇదే అత్యంత అధిక ధర కావడం విశేషం.
ఎండు మిరప భారీ ధర పలుకుతోంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ ఎనుమాముల(వరంగల్) లో నిన్న సోమవారం క్వింటాలు ధర రూ. 81 వేలు పలికింది. నిన్న సుమారు 6 వేల క్వింటాళ్ల ఎండు మిరప మార్కెట్‌కు అమ్మకానికి వచ్చింది. తేజా రకం ఎండు మిర్చికి నిన్న క్వింటాలుకు రూ. 36 వేల ధర పలికింది. ఇక దేశీ మిర్చి రకం క్వింటాలు రూ. 81 వేల ధర పలికింది. గత ఏడాది సీజన్‌లో ఎండు మిర్చి ధర క్వింటాలుకు రూ. 96 వేలు పలికింది. ఉమ్మడి వరంగల్లు, ఖమ్మం జిల్లాల్లో రైతులు ఎక్కువగా మిర్చి సాగు చేశారు.
ఇక జనవరి 7న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రావిచెట్టు తండాకు చెందిన రైతు తేజావత్ రాములుకు చెందిన దేశీ రకం రెడ్ చిల్లీకి క్వింటాలు రూ. 80,100 ధర పలికింది. దేశీ రకం ఎండు మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడతారు. తెలుగు రాష్ట్రాల్లో పండే దేశీ రకం ఎండు మిర్చికి చాలా డిమాండ్ ఉంటుంది.
రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 7.45 లక్షల హెక్టార్లలో రెడ్ చిల్లీ పంట సాగు చేస్తారు. ఏటా సుమారు 19 లక్షల టన్నుల ఎండు మిరప ఉత్పత్తి అవుతుందని అంచనా. దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం ఎండు మిర్చిలో మూడింట రెండు వంతులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతుంది.
టాపిక్