TG Government Schemes : 'ఆ జాబితాలు ఫైనల్ కాదు' - డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని… దరఖాస్తులు సమర్పణపై అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దని కోరారు.
పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని కోరారు. గ్రామ సభల నిర్వహణపై మంగళవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… 4 నూతన పథకాల అమలు కోసం గ్రామసభలు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొదటి రోజు 4938 గ్రామ/ వార్డు సభలు నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామసభలలో ప్రదర్శించిన పథకాల అర్హుల ప్రాథమిక జాబితాలో అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా స్వీకరించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అనర్హులుగా తేలితే జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.
మంజూరు పత్రం కాదు…
గ్రామసభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమేనని ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తులు తీసుకుంటామని… విచారించి అర్హులకు తప్పనిసరిగా పథకాలు అందిస్తామని ప్రజలకు స్పష్టంగా అధికారులు తెలపాలని దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం ఎప్పుడైనా మండలాలు , మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాపాలన కేంద్రాలకు వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్హులను ఎంపిక చేసి పథకాలను వర్తింపచేయడం జరుగుతుందని తెలిపారు.
అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వండి - మంత్రి ఉత్తమ్
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో 91 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ఇందులో 2 కోట్ల 80 లక్షల లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. గత 10 సంవత్సరాలలో నూతన రేషన్ కార్డులు జారీ చేయని కారణంగా ప్రస్తుతం ప్రజల నుంచి అధికంగా డిమాండ్ ఉందన్నారు.
ప్రజా పాలన, మీసేవ కేంద్రాలలో రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి రేషన్ కార్డు లింక్ ఉండటంతో అర్హులందరికీ రేషన్ కార్డు జారి అయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని… ఈ విషయంలో ప్రజలకు విశ్వాసం కల్పించాలని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… ఇంటి స్థలం ఉన్నవారిలో ప్రాధాన్యత క్రమంలో నిరుపేదలను గుర్తిస్తున్నామని చెప్పారు. మొదటి విడత కింద తీసుకొని ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
సంబంధిత కథనం