Bhatti Vikramarka: బస్సులో ప్రయాణించి, మహిళలతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం భట్టి-deputy cm bhatti who traveled by bus and chats with women ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhatti Vikramarka: బస్సులో ప్రయాణించి, మహిళలతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: బస్సులో ప్రయాణించి, మహిళలతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం భట్టి

HT Telugu Desk HT Telugu
Published Jun 13, 2024 05:52 AM IST

Bhatti Vikramarka: కరెంటు మంచిగా వస్తుందా? ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎలా ఉంది? ఎన్నిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీప్రయాణికుల్ని ఆరా తీశారు.

ఖమ్మంలో ఆర్టసీ బస్సులో ప్రయాణిస్తున్న డిప్యూటీ సిఎం మల్లు
ఖమ్మంలో ఆర్టసీ బస్సులో ప్రయాణిస్తున్న డిప్యూటీ సిఎం మల్లు

Bhatti Vikramarka: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క. బుధవారం సాయంత్రం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్లు మండలం జగన్నాధపురం వరకు సామాన్యుడిలా ప్రయాణం చేస్తూ స్థానికులను పలు అంశాలపై ఆరా తీశారు.

కరెంటు మంచిగా వస్తుందా? ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఎలా ఉంది? ఎన్నిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బుధవారం సాయంత్రం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్లు మండలం జగన్నాధపురం వరకు సామాన్యుడిలా ప్రయాణం చేస్తూ స్థానికులను పలు అంశాలపై ఆరా తీశారు. సామాన్యుడిలా టికెట్ కొనుక్కొని పల్లె వెలుగు బస్సులో డిప్యూటీ సీఎం ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

నాగులవంచ గ్రామానికి చెందిన జానమ్మ, అనంతమ్మలతో డిప్యూటీ సీఎం ముచ్చటించారు. డిప్యూటీ సీఎం ప్రశ్నలకు వారు ఇరువురు స్పందిస్తూ 'బడి, గుడి, పేరంటాలకు ఉచితంగా బస్సులో వెళ్లడం మూలంగా డబ్బులు మిగులుతున్నాయి, ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతోంది' అని సంతోషంగా సమాధానం ఇచ్చారు.

ఈ క్రమంలో ఉచితంగా ప్రయాణం చేసే మహిళలకు జారీ చేస్తున్న జీరో టికెట్ల విధానం గురించి కండక్టర్ శైలజను డిప్యూటీ సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పలు అంశాలు వెల్లడించారు. ఫ్రీ బస్సులు వాడుకుంటున్న మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని భట్టి విక్రమార్క తెలిపారు.

మహిళలకు రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల ఆర్టీసీ బలోపేతం అవుతున్నదని, కొత్తగా 300 పైగా బస్సులు కొనుగోలు చేశారని అన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ విస్తరణకు దోహదపడుతున్నదని ఆయన అన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రయాణికుల సంఖ్య బస్సుల్లో పెరిగినందున కొత్త బస్సులు కావలసిన అవసరం ఏర్పడుతున్నదని డిప్యూటీ సీఎం వివరించారు.

స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రుణాలు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీలో పెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో 92 శాతం ఉన్న బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వ పనితీరు ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం పాత బస్టాండ్ లో పాతర్లపాడు గ్రామానికి వెళ్లే బస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీల మేరకు అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలకు ప్రారంభించామన్నారు .

ప్రతినెల రూ.300 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్న డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీకి చెల్లించడం వల్ల ఆ సంస్థ బలోపేతం అవుతున్నదని అన్నారు. కొత్త బస్సుల కొనుగోలు ఆర్టీసీ విస్తరణకు ఉచిత బస్సు పథకం ఎంతగానో దోహదపడుతున్నదని, గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఉంటుందా? మూసివేస్తారా? అమ్ముతారా అనే అనుమానాలు ఉన్నాయని, ప్రతినెల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదని, ఆర్టీసీ అమ్మేస్తారన్న వార్తలు కూడా వచ్చాయని, అలాంటి దుస్థితిలో ఉన్న ఆర్టీసీని ఉచిత ఆర్టీసీ పథకం ద్వారా ప్రజా ప్రభుత్వంలో ఆర్థికంగా బలోపేతం చేశామని తెలిపారు.

ఆర్టీసీకి ఉన్న అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించడానికి ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రూట్లల్లో బస్సుల అవసరం ఉన్నాయా కూడా సర్వే చేయిస్తున్నామన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచడానికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

(రిపోర్టింగ్ కాపర్తి నరేంద్ర, ఖమ్మం జిల్లా)

Whats_app_banner