TG Weather Update : దట్టమైన పొగమంచు కప్పేస్తోంది.. ఈ జిల్లాలకు అలర్ట్.. జనవరి నెలంతా ఇంతే!-dense fog is falling in eastern telangana districts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Weather Update : దట్టమైన పొగమంచు కప్పేస్తోంది.. ఈ జిల్లాలకు అలర్ట్.. జనవరి నెలంతా ఇంతే!

TG Weather Update : దట్టమైన పొగమంచు కప్పేస్తోంది.. ఈ జిల్లాలకు అలర్ట్.. జనవరి నెలంతా ఇంతే!

TG Weather Update : తెలంగాణలో మంచు దట్టంగా కురుస్తోంది. తూర్పు తెలంగాణ జిల్లాలపై మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణలో మంచు

రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తుందని.. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాత్రి, తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

తెల్లవారుజామున, రాత్రిపూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. జనవరి మాసమంతా పొగమంచు కమ్మేస్తుందని.. జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలకు పడిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో 11-15 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పొగమంచు కమ్మేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగ ప్రయాణాలు చేస్తున్నారు.

పిల్లలు.. వృద్ధులు జాగ్రత్త..

పండగ వేళ దూర ప్రాంతాలకు వెళ్లేవారు తెల్లవారుజాము నుంచే ప్రయాణాలకు సిద్ధం అవుతున్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులతో వెళ్లే వారు చలి వాతావరణంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చెవి లోపలికి చల్ల గాలిపోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. చలి, పొగమంచులో బయటకు వెళ్లడం వల్ల శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో మరింత ప్రమాదకరం.

మరింత ముప్పు..

పొగ మంచులో కాలుష్యం చేరడంతో మరింత ముప్పు తెస్తుంది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన వచ్చినప్పుడు ముక్కు, నోరు, చెవులు కప్పిఉంచేలా మంకీ క్యాపు, మాస్క్‌ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వచ్చాక వాకింగ్, ఇతర వ్యాయామాలు చేసుకోవడం మంచిదని స్పష్టం చేస్తున్నారు.

వాహనదారులు జాగ్రత్త..

ఉదయం పొగ మంచు కమ్మేయడంతో.. దగ్గరకు వెళ్లే వరకు వాహనం కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశముంది. రోడ్లపై నడిచి వెళ్లేవారు దగ్గరకు వచ్చే వరకు కనిపించే పరిస్థితి ఉండదు. గాలిలోని దుమ్ము, ధూళి కణాలతో మంచు చేరి భూఉపరితలంపై పేరుకుపోయి పొగ మంచుగా రూపాంతరం చెందుతుంది. ఎండ వచ్చేవరకు గాలిలో తేలుతూ ఉంటుంది. రాత్రి వేళ హైబీమ్‌ లైట్లు వాడటం ప్రమాదం. పొగ మంచులో వాహనం నడిపేప్పుడు హెడ్‌ లైట్స్‌ డిప్‌ చేయాలి. ఎదురుగా వచ్చే వాహనం స్పష్టంగా కనిపించే అవకాశముంటుందని అధికారులు సూచిస్తున్నారు.