Ippatam : పవన్ పార్టీకి సహకరించామనే మా ఇళ్లు కూల్చేస్తున్నారు.. ఇప్పటం గ్రామస్తులు-demolition of houses at ippatam by municipal authorities villagers protest against officials actions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Demolition Of Houses At Ippatam By Municipal Authorities Villagers Protest Against Officials Actions

Ippatam : పవన్ పార్టీకి సహకరించామనే మా ఇళ్లు కూల్చేస్తున్నారు.. ఇప్పటం గ్రామస్తులు

HT Telugu Desk HT Telugu
Mar 04, 2023 03:01 PM IST

Ippatam : ఇప్పటం గ్రామంలో అధికారులు మళ్లీ కూల్చివేతలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారంటూ.. నిర్మాణాలు తొలగిస్తున్నారు. 12 ఇళ్ల ప్రహరీలను కూలగొట్టారు. అధికారుల తీరుపై మండిపడుతున్న గ్రామస్తులు.. కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని జనసేన నేతలు పేర్కొంటున్నారు.

ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు
ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు

Ippatam : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అధికారులు గ్రామంలో మళ్లీ ఇళ్ల కూల్చివేతలు చేపట్టడంతో.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం రెండు బస్సుల్లో ఇప్పటం చేరుకున్న పోలీసులు.. గ్రామంతో పాటు సరిహద్దుల్లోనూ పహారా పెట్టారు. అనంతరం.... క్రేన్లు, జేసీబీలతో గ్రామానికి వచ్చిన అధికారులు... ఇళ్ల కూల్చీవేతలు మొదలుపెట్టారు. నిబంధనలు అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారంటూ అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. 12 గృహాల ప్రహరీ గోడలను ఇప్పటికే నగర పాలక సంస్థ అధికారులు కూలగొట్టారు. రెండు జేసీబీలతో ప్రహరీలను కూల్చివేశారు.

ట్రెండింగ్ వార్తలు

గ్రామస్తుల తీవ్ర నిరసనల మధ్యే నిర్మాణ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో కొన్ని ఇళ్లను తొలగించిన అధికారులు మరోసారి ఇళ్లను కూల్చేందుకు చర్యలు తీసుకోవటంపై స్దానికులు మండిపడుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఎలా కూలగొడతారని స్థానికులు అధికారులని నిలదీస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసులని మోహరించారు. గ్రామ సరిహద్దుల్లోనూ పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, వివరాలను నమోదు చేసుకొని పంపిస్తున్నారు.

అక్రమంగా తమ ఇళ్ళను తొలగిస్తున్నారంటూ ఇప్పటం గ్రామంలోని స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి , ఆందోళన చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కావాలని తమపై కక్షతో ఆక్రమణలను తొలగిస్తున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే ఆక్రమణలను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. నోటీసులు ఇచ్చామని నగర పాలక సంస్థ అధికారులు పేర్కొంటుండగా... అలాంటివేమీ ఇవ్వలేదని గ్రామస్తులు అంటున్నారు.

ఏపీలో మున్సిపల్ అధికారులు కేవలం ఒక్క ఇప్పటం గ్రామంలోనే పనిచేస్తున్నారా అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని అనేక చోట్ల అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటిని తొలగించకుండా, అనేక సంవత్సరాలుగా నివాసం ఉండే వారిపై కక్ష పెంచుకుని తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో 70 అడుగుల రోడ్డు అవసరం లేదని అంటున్నారు. గతేడాది జనసేన ఆవిర్భావ సభ ఇప్పటంలో జరిగిన నాటి నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుందని విమర్శిస్తున్నారు. గ్రామానికి రవాణా సౌకర్యం లేదని... బస్సులు రావని, భారీ వాహనాలు ఇక్కడ నుంచి వెళ్లవని పేర్కొంటున్న గ్రామస్తులు... రోడ్డు విస్తరణ చేసి ఏం చేసుకుంటారని నిలదీస్తున్నారు. కేవలం కక్ష్య సాధింపు కోసం నిర్మాణాల కూల్చివేస్తున్నారని మండిపడుతున్నారు.

స్థానికులకు జనసేన, టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. గ్రామస్తులకు న్యాయం చేయాలంటూ జనసేన నేతలు నిరాహారదీక్షకు దిగారు. గ్రామంలోని రామాలయంలో స్థానికులకు మద్దతుగా దీక్ష మొదలుపెట్టారు. అధికారులు వచ్చి ఇళ్లు కూల్చమని హామీ ఇచ్చిన తర్వాతే దీక్షను విరమిస్తామని స్పష్టం చేశారు. జనసేన సభకు స్థలాలు ఇవ్వడమే స్థానికులు చేసిన పాపమా అని ప్రశ్నించారు. కూల్చివేసిన ప్రతి ఇంటికి పరహారం ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని.. గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చెప్పారు.

గతేడాది జనసేన పార్టీ ఆవిర్భావ సభని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామ పరిధిలో నిర్వహించారు. సభ నిర్వహణకు గ్రామస్తులు సహకరించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత... గ్రామంలో రోడ్డుని ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ... అధికారులు గతేడాది నవంబర్ లో పలు నిర్మాణాలూ కూల్చివేశారు. ఇక.. ఈ ఏడాది మచిలీపట్నంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తామని పార్టీ నేతలు ప్రకటించిన మరుసటి రోజే.... ఇప్పటంలో అధికారులు మళ్లీ కూల్చవేతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

IPL_Entry_Point