YS Sharmila : కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం వైపు షర్మిల అడుగులు, దిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ!
YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల దిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతున్న షర్మిల పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్న ఆమె...కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని తెలుస్తోంది. బెంగుళూరు నుంచి దిల్లీ వెళ్లిన షర్మిల, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఇవాళ భేటీ కానున్నట్టు సమాచారం. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనంపై వీరి మధ్య చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం విలీనంపై షర్మిల నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో విలీనంపై షర్మిల ఇప్పటికే వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు, నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే షర్మిల తెలంగాణ నుంచే పోటీకి మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఆమె పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిల సేవలను ఏపీలో వాడుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. షర్మిల తెలంగాణ నుంచి పోటీని కొందరు టి.కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
సోనియాతో భేటీ అనంతరం విలీనంపై ప్రకటన
వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. షర్మిల కోరిక మేరకు తెలంగాణలో ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం షర్మిల సేవలను ఏపీలోనూ వాడుకోవాలని భావిస్తోంది. దిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల... సోనియా గాంధీతో భేటీ అనంతరం విలీనం ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. షర్మిల పార్టీ విలీనానికి దాదాపుగా అన్ని చర్చలు పూర్తై, ఇంక అధికారిక నిర్ణయం ఒకటే ఉందని కొందరు నేతలు అంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారం మొత్తం నడిపారు. షర్మిల, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య మధ్యవర్తిత్వం వహించిన శివకుమార్... షర్మిల కోరుకున్నట్లుగా తెలంగాణ నుంచి పోటీకి అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ కోరుతున్నట్లుగా షర్మిలను ఏపీలోనూ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇందుకు షర్మిల అంగీకరించారని తెలుస్తోంది. ఈ నెల 12న దిల్లీలో వైఎస్ షర్మిల సోనియా గాంధీ సమావేశం కానున్నారు.
ఏపీ, తెలంగాణలోనూ కీలక బాధ్యతలు
కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్.. నెక్ట్స్ తెలంగాణను టార్గెట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కలిసి వచ్చే ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. పార్టీలో వచ్చే వారి కోసం గేట్లు ఎత్తిన కాంగ్రెస్...టికెట్లపై హామీలు కూడా ఇచ్చేస్తోంది. అందులో భాగంగానే వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. పార్టీ విలీనంపై షర్మిల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఏపీ, తెలంగాణలోనూ షర్మిల సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ స్టార్ క్యాంపెయినర్ గా షర్మిలను రంగంలోకి దించాలని అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.