Revanth Reddy : నవంబర్ 30న బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి, డిసెంబర్ లో అద్భుతం- రేవంత్ రెడ్డి-delhi tpcc chief revanth reddy says liberation of telangana from brs on november 30th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Delhi Tpcc Chief Revanth Reddy Says Liberation Of Telangana From Brs On November 30th

Revanth Reddy : నవంబర్ 30న బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి, డిసెంబర్ లో అద్భుతం- రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Oct 09, 2023 04:30 PM IST

Revanth Reddy : కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. నవంబర్ 30న తెలంగాణకు విముక్తి కలగబోతోందన్నారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Revanth Reddy : నవంబరు 30న తెలంగాణకు విముక్తి కలగబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పట్టిన చీడ నుంచి తెలంగాణకు విముక్తి లభించనుందన్నారు. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన నేపథ్యంలో దిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి, తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందన్నారు. నవంబర్ 30న తెలంగాణకు పట్టిన పీడ విరగడకాబోతోందని రేవంత్ అన్నారు. రాబోయే విజయదశమిని తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

కేటీఆర్, హరీశ్ రావుకు సవాల్

అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా-రంగాలలో మొదలైందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే స్థాయి లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. “బిల్లా రంగాలకు(కేటీఆర్, హరీశ్ రావు) సూటిగా సవాల్ విసురుతున్నా... 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలలో వేటిపైనైనా చర్చకు సిద్ధం అన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో మీరు ఏంచేశారో చర్చకు రావాలని, తేదీ చెప్పండి... అమరవీరుల స్థూపం వద్ద చర్చకు మేం సిద్ధం అని కేటీఆర్, హరీశ్ రావులకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

ఇక కేసీఆర్ కు విశ్రాంతి

తెలంగాణలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని, పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందన్నారు. ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారన్నారు. డిసెంబర్ లో అద్భుతం జరగబోతుందన్న రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు.

కేసీఆర్ కుటుంబీకులు శ్రీమంతులు

పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు రేవంత్ రెడ్డి. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబీకులు శ్రీమంతులు అయ్యారు తప్ప... ప్రజలకు ఒరిగిందేం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందిస్తామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి మహిళలను ఆదుకుంటామన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం , ప్రతీ రైతుకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా రూ.15 వేలు అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. సంపద పెంచాలి... పేదలకు పంచాలి అన్నదే కాంగ్రెస్ విధానమన్నారు రేవంత్ రెడ్డి.

బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం

తాముబీజేపీ, బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంటే అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు రేవంత్ రెడ్డి. వారు ఎవరి పక్షాన నిలబడ్డారో, ఎవరికి మద్దతుగా నిలుస్తారో తేల్చుకోవాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆరెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 2018లోనూ బీజేపీ ఇలాంటి కుట్రలే చేసి, 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. బీజేపీ, బీఆరెస్ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందని, ఈ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు. ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

IPL_Entry_Point