Delhi excise policy: హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు
Delhi excise policy: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోవిడత ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అక్రమాలపై దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ అంశాల్లో దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తాజాగా దాడులు ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ, పంజాబ్‌లోని దాదాపు 35 చోట్ల, హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కొన్ని మద్యం పంపిణీదారులు, కంపెనీలు, అనుబంధ సంస్థలపై సోదాలు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటి వరకు 103 కంటే ఎక్కువ దాడులు నిర్వహించింది. ఈ కేసులో గత నెలలో మద్యం వ్యాపారి, ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహంద్రును కూడా అరెస్టు చేసింది.
మనీలాండరింగ్ కేసును సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన తర్వాత మద్యం పాలసీపై దర్యాప్తు జరిగింది. ఈ విషయంలో 11 మంది ఎక్సైజ్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు.
హైదరాబాద్‌లో ఇదివరకు అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమసాగర్ గండ్ర, అభిషేక్ రావు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీలు సోదాలు నిర్వహించింది.