Rahul Gandhi To T Congress : ఈగోలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయండి, టి.కాంగ్రెస్ చీఫ్ కు రాహుల్ క్లాస్!-delhi aicc meeting telangana congress leader rahul gandhi class to revanth reddy on internal issues ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rahul Gandhi To T Congress : ఈగోలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయండి, టి.కాంగ్రెస్ చీఫ్ కు రాహుల్ క్లాస్!

Rahul Gandhi To T Congress : ఈగోలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయండి, టి.కాంగ్రెస్ చీఫ్ కు రాహుల్ క్లాస్!

Bandaru Satyaprasad HT Telugu
Jun 27, 2023 07:07 PM IST

Rahul Gandhi To T Congress : పార్టీలో ఎవరు ఈగోలతో వ్యవహరించినా ఉపేక్షించేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని నేతలు సూచించారు.

రాహుల్  గాంధీ, రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి

Rahul Gandhi To T Congress : తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అమలుచేయాల్సిన వ్యూహాలపై చర్చించారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ చూపుతున్నట్లు తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని రాహుల్ పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ పై తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నారని... రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ తో పాటుగా సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లో వెనుకబడి ఉన్నారని రాహుల్ తేల్చి చెప్పారని సమాచారం. పార్టీలో విభేదాలు పక్కన పెట్టాలని సీనియర్లకు గుర్తింపు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ కు చేసిన ఫిర్యాదు పైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ ఆపరేషన్ తెలంగాణ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆపరేషన్ తెలంగాణ ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కార్యాచరణతో సిద్ధమయ్యారు. కర్ణాటక గెలుపును తెలంగాణలోనూ కొనసాగించాలనే రాహుల్ పట్టుదలతో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలంతా కలిసి కట్టుగా పనిచేయటం వల్లే అధికారంలోకి వచ్చిన అంశాన్ని రాహుల్ గెలుపు వ్యూహంలో ప్రధాన అంశంగా గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ కు అదే విషయాన్ని స్పష్టం చేశారు. పార్టీ కోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలు..ఈగోలతో వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుపై రాహుల్ ఆరా

రేవంత్ రెడ్డపై మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. తనపై రేవంత్ టీమ్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలు సమర్పించారు. తనను పార్టీ నుంచి బయటకు పంపే విధంగా పొమ్మనకుండా పొగ పెడుతున్నారని నేరుగా సోనియాకు వివరించారు. ఈ అంశంపై రాహుల్ రేవంత్ తో మాట్లాడినట్లు సమాచారం. ఇదే సమయంలో రేవంత్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఆదరణ తగ్గటం పైనా ఆరా తీసినట్లు సమాచారం. మినీ ఇండియాగా భావించే మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ వెనుకబడి ఉన్నట్లు సర్వే నివేదికలు అందాయని రాహుల్ రేవంత్ తో అన్నారని తెలుస్తోంది. పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లాలని రేవంత్ కు రాహుల్ సూచించారని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ టీమ్ కొడంగల్ నియోజకవర్గంలో పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారంగా రాహుల్ ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పిన రాహుల్ గాంధీ..నేతల్లో సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీలో సమస్యలు సృష్టిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాహుల్ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. అందరూ సమన్వయంతో సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఎన్నికల్లో అధికారం దక్కేలా పనిచేయాలని సూచించారు. కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో అనే నినాదంతో పార్టీ నేతలంతా పనిచేయాలని రాహల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గంపై రాహుల్ వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు గుర్తించిన నేతలు అప్రమత్తం అయ్యారు.

Whats_app_banner