Medak Attack: మెదక్ లో పట్టపగలే దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడి-degree student attacked with knife by lover in medak ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Attack: మెదక్ లో పట్టపగలే దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడి

Medak Attack: మెదక్ లో పట్టపగలే దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడి

HT Telugu Desk HT Telugu
Nov 04, 2024 01:08 PM IST

Medak Attack: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ డిగ్రీ విద్యార్థిపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గేటు ముందు సోమవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

డిగ్రీ విద్యార్థినిపై దాడి చేసిన ప్రియుడు
డిగ్రీ విద్యార్థినిపై దాడి చేసిన ప్రియుడు

Medak Attack: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ డిగ్రీ విద్యార్థిపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గేటు ముందు సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మెదక్ పట్టణం అవిసెలపల్లి గ్రామానికి చెందిన నాగారం కృష్ణవేణి హైదరాబాద్ కు చెందిన కుమార్ ను పెళ్లి చేసుకుని హైదరాబాదులోనే స్థిరపడ్డారు.

ఆరేళ్ల క్రితం కృష్ణవేణి, ఆమె కూతురు దివ్యకృపలు హైదరాబాద్‌ నుంచి అవుసుల పల్లి గ్రామానికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. కృష్ణవేణి భర్త కుమార్ హైదరాబాదులో పనిచేస్తూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు.

దివ్య కృప మెదక్ పట్టణంలోని డాన్ బాస్కో స్కూల్లో గతంలో ప్రైవేటు టీచర్ గా పనిచేసేది. నెల రోజుల క్రితం ఆమెను స్కూల్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ యువతికి హైదరాబాద్లో ఉన్నప్పుడే బెంగుళూరుకు చెందిన చేతన్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉండేదని చెబుతున్నారు.

సోమవారం ఆమెకు ఓపెన్ డిగ్రీ పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు ఉంది. దివ్య ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చింది. అక్కడికే ఆమె ప్రియుడు చేతన్ కూడా వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో చేతన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కుడి చేతి పై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పారిపోయాడు.

అది గమనించిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మెదక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంగారెడ్డిలో మరో ఘటన .…

చుట్టం చూపుగా ఇంటికి వచ్చి పాతకక్షలతో తండ్రికొడుకులపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి అందోల్ మండలం అల్మయిపేటలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన బత్తిని నగేష్ శనివారం అల్మయిపేట గ్రామానికి చెందిన ఆగమయ్య ఇంటికి బంధువుగా వచ్చాడు.

తాను ఓ పని నిమిత్తం జోగిపేటకు వచ్చానని, చీకటి పడడంతో ఇక్కడికి వచ్చానని చెప్పాడు. అనంతరం భోజనం చేసి అందరూ ఆగమయ్య ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించాడు. అందరూ పడుకున్నాక ప్లాన్ ప్రకారం నగేష్ వెంట తెచ్చుకున్న కత్తితో ఆగమయ్యపై దాడి చేశాడు. అది గమనించిన ఆగమయ్య కుమారుడు వెంకట్ వచ్చి నగేష్ ఆపే ప్రయత్నం చేయగా అతడిపై కూడా కత్తితో దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

అది చూసిన ఆగమయ్య భార్య పెద్దగా కేకలు వేయడంతో నగేష్ అక్కడి నుండి పారిపోయాడు. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నగేష్, ఆగమయ్యకు రెండు నెలల కిందట ఓ శుభకార్యంలో గొడవ జరిగింది. ఆ విషయంలో కక్ష పెంచుకొని ఆగమయ్యపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner