సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా కర్మాగారంలో పేలుడు ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందటంతో…. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40కి చేరింది.
జూన్ 30న సిగాచీ కంపెనీలో పేలుడు జరిగింది. ఇందులో 70 శాతానికి పైగా కాలిన గాయాలపాలైన ఉత్తరప్రదేశ్ కు చెందిన 48 ఏళ్ల మున్మున్ చౌదరి ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శనివారం ఉదయం వరకు 19 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో గల్లంతైన తొమ్మిది మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
ప్రమాదం జరిగి ఆరు రోజులైనా ఇంకా దొరకని 9 మంది ఆచూకీ దొరకలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. భూమిలో అవశేషాలు దొరుకుతాయోమోనని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు హెల్ప్‌డెస్క్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తమ వారి జాడ చెప్పాలంటూ జిల్లా ఎస్పీ పంకజ్‌తో బాధితులు వాగ్వాదానికి దిగారు.
మరోవైపు ఈ ఘటనపై సిగాచి కంపెనీ యాజమాన్యం స్పందించిన సంగతి తెలిసిందే. పాశమైలారంలో పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు సిగాచి కంపెనీ తరపున రూ.1 కోటి ఆర్ధిక సాయం అందజేస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తామని స్పష్టం చేసింది. గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తామని… బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని సిగాచి కంపెనీ వెల్లడించింది. మీడియాలో వచినట్లు రియాక్టర్ పేలుడు ప్రమాదానికి కారణం కాదని తెలిపింది.పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తర్వాత… ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని తెలిపింది.90 రోజుల పాటు కంపెనీని తాత్కాలికంగా మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.