తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన ఓ లేఖ… ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా పార్టీ అధినేత, తండ్రి అయిన కేసీఆర్ కే ఈ లేఖను సంధించారు. పార్టీలోని పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. ఓవైపు పాజిటివ్ అంశాలను ప్రస్తావిస్తూనే…. మరోవైపు లోపాలను సూటిగా చూపారు. ఇందుకు సంంబంధించిన ఓ లేఖ బయటికి రావటంతో…. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది…? కుటుంబ విభేధాలు తారాస్థాయికి చేరాయా..? మరేమైనా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి.
‘మై డియర్ డాడీ’ అంటూ ఎమ్మెల్సీ కవిత ఆరు పేజీల లేఖ రాసినట్లు తెలుస్తోంది. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు. ఎల్కతుర్తి సభ గురించి ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఓ రకంగా సభ నిర్వహణ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభా వేదికపై పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన నాయకులు, ధూంధాం కార్యకర్తలు ప్రసంగించి ఉంటే.. అది శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపి ఉండేదన్నారు.
పార్టీ లీడర్స్‌కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత తన లేఖ ద్వారా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడడంతో అనుమానాలు బలపడుతున్నాయని… బీజేపీ వల్ల తాను కూడా చాలా ఇబ్బందిపడ్డాను అని గుర్తు చేశారు. సభా వేదిక నుంచి బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చిందనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని… ఇది పార్టీకి ప్రతికూలంగా మారిందని కవిత గుర్తు చేశారు.
వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేదని… బీసీలకు 42 శాతం కోటా అంశం విస్మరించినట్లు కవిత తన లేఖలో గుర్తు చేశారు.ఎస్సీ వర్గీకరణపై కూడా మాట్లాడలేదని చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీకి నిర్దిష్టమైన కార్యక్రమాలు, మార్గదర్శకాలు అవసరమని అంతా భావించారని… కానీ వరంగల్ సభలో అలాంటి స్పష్టత కొరవడిందని ప్రస్తావించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయం వంటి అంశాలను కూడా ఇందులో పేర్కొన్నారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో కవిత ఉన్నారు. ఆమె విదేశాల్లో ఉంటున్న సమయంలో లేఖ బయటికి రావటంతో… బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు ఉలికిపాటుకు గురవుతున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతోందని చర్చించుకున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత…. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ లైన్ లోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయిన ఆ పార్టీ…. ఆ తర్వాత ఒక్కో కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలను బలంగా చేసింది. ఈ విషయంలో సక్సెస్ అవుతూనే వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా చేజారనివ్వకుండా సద్వినియోగం చేసుకున్నట్లు కనిపించింది.
కట్ చేస్తే పార్టీ రజతోత్సవ సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాలుగైదు నెలలుగా కసరత్తు చేయగా… ఏప్రిల్ లో సభను నిర్వహించింది. భారీ స్థాయిలో జనసమీకరణ చేయటంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే సభ తర్వాత అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి సభ ఏర్పాట్ల బాధ్యతలను ముందుగా హరీశ్ రావుకు అప్పగించారు. దీంతో ఆయన పలుమార్లు క్షేత్రస్థాయిలో కూడా పర్యటించారు. సభ కోసం స్థలాలను కూడా పరిశీలించారు. అయితే ఉన్నట్టుండి… హరీశ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ సీన్ లోకి వచ్చారు. అయితే హరీశ్ రావును తప్పించారా..? లేక తప్పుకున్నారా..? అన్న చర్చ గట్టిగా జరిగింది.
ఇక రజతోత్సవ సభ వేదికపై కేవలం కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను మాత్రం ప్రదర్శించారు. కేటీఆర్ కు పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించే కోణంలోనే ఇదంతా జరుగుతుందా..? అన్న చర్చ జోరుగా తెరపైకి వచ్చింది. నిజానికి కూడా వేదికపై ఏ ఇతర నాయకుల ఫొటోలకు కూడా అవకాశం కల్పించలేదు. అంతేకాదు పార్టీ వేదికపై కేవలం కేసీఆర్ మాత్రమే మాట్లాడారు. ఏ ఒక్క నాయకుడికి కూడా అవకాశం ఇవ్వలేదు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. బీసీ అజెండాతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండా కాకుండా…. కవిత కేంద్రంగానే ఇదంతా నడుస్తోంది. జిల్లా పర్యటనలు చేస్తూ తమ మార్క్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మే డే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె… కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది.
“భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం. భూమి ఉన్న వాళ్లకే పంట పెట్టుబడి సాయం ఇచ్చాం. కానీ ఏమీ లేనివాళ్లకు ఏం చేయలేకపోయాం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలు అస్త్రంగా మలుచుకున్నాయి. గత పదేళ్ల పాటు అధికారంలోకి ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే కదా… సామాజిక తెలంగాణ దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోయారంటూ ప్రశ్నలు ఎక్కుబెట్టారు. అంతేకాదు… రైతుబంధు విషయంలో పలు ప్రశ్నలను సంధించారు. కవిత వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు కూడా సమర్థించుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు అయింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ చర్చనీయాంశంగా మారిపోయాయి.
ఇటీవలే మీడియాతో మాట్లాడిన కవిత… తనపై కుట్రలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు. వాళ్లెవరో తనకు తెలుసని… టైమ్ వచ్చినప్పుడు బయటపెడతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత పార్టీపై కూడా ఉందంటూ ఆవేదనను వ్యక్తపరిచేలా మాట్లాడారు. అయితే కవిత…. పార్టీలోని ఓ కీలక నేతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారంట..!
ఎమ్మెల్సీ కవిత తీరు చూస్తుంటే పార్టీలోని పరిస్థితులపై ఆమె తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయని చెప్పొచ్చు. పార్టీ నుంచి తనని సైడ్ చేస్తున్నారనే భావన ఆమెలో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీలో తన ప్రియారిటీని తగ్గించే పరిణామాలు కనిపిస్తున్నాయనే భావనలో కూడా కవిత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే….ఆమ సొంతగా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పూలే విగ్రహా ఏర్పాటు, బీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ల వంటి పలు అంశాలపై కవిత ప్రధానంగా పోరాడుతున్నారు. దీక్షలతో పాటు పలు కార్యక్రమాలను కూడా చేపట్టారు. అంతేకాదు జిల్లాల పర్యటనలు కూడా చేస్తున్నారు. మరోవైపు జాగృతితో పాటు అనుబంధ సంఘాలను కూడా బలోపేతం చేస్తున్నారు. ఇటీవలనే జాగృతి అనుబంధ సంఘాలకు కొత్త కమిటీలను కూడా ప్రకటించారు. మొత్తంగా తన కార్యక్రమాలకు మరింత పదును పెట్టే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు.
కవిత తీరుపై రాజకీయవర్గాల్లోనే కాదు సొంత పార్టీలోనూ చర్చ జరుగుతోంది. పార్టీ పగ్గాల విషయంలోనే ఇదంతా జరుగుతుందా..? అన్న డిస్కషన్ కూడా తెరపైకి వస్తోంది. ఇప్పటివరకు పార్టీలో కేసీఆర్ తర్వాత…. కేటీఆర్, హరీశ్ రావ్ అంతా తామై నడిపిస్తున్నారు. భవిష్యత్తులో వీరిలోనే ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో కవితకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కోణంలోనే ఆమె… ఇదంతా చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
నిజానికి ప్రస్తుతం బయటికి వచ్చిన లేఖ… ఎల్కతుర్తి సభ తర్వాత కవిత…. కేసీఆర్ కు రాసినట్లు తెలుస్తోంది. మొత్తంగా కవిత రాసిన లేఖ వ్యవహారం బీఆర్ఎస్ లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ సంచలనంగా మారింది. ఈ లేఖ వ్యవహారం పార్టీ అంతర్గత సమస్య వరకే ఉంటుందా..? లేక సరికొత్త రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందా…? అనేది చూడాలి…!
సంబంధిత కథనం