Siddipet Tragedy: సిద్దిపేటలో విషాదం, తండ్రి తిట్టాడని బావిలో దూకిన కుమార్తె, రక్షించబోయిన తండ్రితో సహా కూతురు మృతి-daughter jumped into the well because her father scolded her daughter died along with the father ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Tragedy: సిద్దిపేటలో విషాదం, తండ్రి తిట్టాడని బావిలో దూకిన కుమార్తె, రక్షించబోయిన తండ్రితో సహా కూతురు మృతి

Siddipet Tragedy: సిద్దిపేటలో విషాదం, తండ్రి తిట్టాడని బావిలో దూకిన కుమార్తె, రక్షించబోయిన తండ్రితో సహా కూతురు మృతి

HT Telugu Desk HT Telugu
Jun 25, 2024 05:12 PM IST

Siddipet Tragedy: సిద్దిపేటలో తాగొచ్చి గొడవ చేస్తున్న తండ్రిని ప్రశ్నించిన కుమార్తెను తండ్రి తిట్టడంతో ఆత్మహత్యకు యత్నించింది. కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించిన తండ్రి కూడా నీట మునిగి మరణించాడు.

సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న యువతి
సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న యువతి

Siddipet Tragedy: సిద్దిపేట జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసై నిత్యం తాగి వచ్చి ఇంట్లో తల్లితో గొడవ పడుతున్న తండ్రిని కూతురు ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి నాకే ఎదురు చెప్తావా అని కుమార్తెను తిట్టడంతో మనస్థాపానికి గురైన బాలిక వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు తండ్రి బావిలో దూకాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తసాన్ పల్లి మధిర గ్రామంలో జరిగింది.

yearly horoscope entry point

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మక్తసాన్ పల్లి మధిర గ్రామం కాశిగుడిసెలకు చెందిన షేక్ సిరాజ్ (47),జరీనా దంపతులకు ముగ్గురు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నాడు. వీరిలో ఇద్దరు కూతుర్ల వివాహాలు చేశారు. సిరాజ్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తాగుడుకు బానిసై నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు.

అమ్మతో ఎందుకు గొడవ పడుతున్నావని .…

సిరాజ్ రోజు మాదిరిగానే సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. దీంతో భార్య జరీనా పని చేయకుండా రోజు తాగి వచ్చి సంసారం నాశనం చేస్తున్నావని భర్తని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో వీరి చిన్న కూతురు రేష్మ (16) మధ్యలో వచ్చి రోజు తాగొచ్చి ఎందుకు అమ్మతో గొడవ పడుతున్నావంటూ తండ్రిని ప్రశ్నించింది. దీంతో సిరాజ్ కోపంతో నాకు ఎదురు చెప్తున్నావని కూతురును తిట్టాడు. తండ్రి తిట్టడంతో మనస్థాపానికి గురైన రేష్మ పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని బావిలో దూకింది.

ఈత రాకపోవడంతో.…

కుమార్తె బావిలో దూకడం గమనించిన తండ్రి ఆమెను రక్షించడానికి బావిలో దూకాడు. కానీ ఈత రాకపోవడంతో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. వెంటనే తల్లి అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని మూడు గంటలు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. ఒకే రోజు తండ్రి, కూతురు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

అప్పుల బాధతో పురుగుల మందు..

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తూప్రాన్ పరిధిలోని కరీంగూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాజధానికి చెందిన కలురామ్ (41) ఐదు నెలల కిందట మేడ్చెల్ జిల్లా బోయినపల్లికి వచ్చి అద్దెకు ఉంటూ ఒక ప్రైవేట్ సంస్థను నిర్వహిస్తున్నాడు. వ్యాపారంలో ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆస్తులన్నీ అమ్ముకున్నాడు.

మనోవేధను గురైన కలురామ్ సోమవారం సాయంత్రం బస్సులో తూప్రాన్ చేరుకున్నాడు. అక్కడ 44 జాతీయ రహదారి పక్కన కరీంగూడ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner