New Year Cyber Crime : సైబర్ సైరన్.. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. ఉన్నదంతా ఊడ్చేస్తారు జాగ్రత్త!-cybercriminals have a new plan in the name of the new year ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  New Year Cyber Crime : సైబర్ సైరన్.. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. ఉన్నదంతా ఊడ్చేస్తారు జాగ్రత్త!

New Year Cyber Crime : సైబర్ సైరన్.. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. ఉన్నదంతా ఊడ్చేస్తారు జాగ్రత్త!

Basani Shiva Kumar HT Telugu
Dec 27, 2024 11:05 AM IST

New Year Cyber Crime : అమాయకులను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. తాజాగా.. కొత్త సంవత్సరం పేరుతో దోచుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్‌గా పోలీసులు సూచించారు. ఒక్క క్లిక్‌తో ఉన్నదంతా ఊడ్చేస్తారని హెచ్చరించారు.

ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. ఉన్నదంతా ఊడ్చేస్తారు జాగ్రత్త!
ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. ఉన్నదంతా ఊడ్చేస్తారు జాగ్రత్త! (istockphoto)

సైబర్ నేరగాళ్లు ప్రతీ సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తాజాగా.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు పేరుతో ఉన్నదంతా ఊడ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సెల్‌ఫోన్ వినియోగదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కినట్టేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కేవలం ఖాతాలు ఖాళీ చేయడమే కాదు.. ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని కూడా తస్కరిస్తారని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.

yearly horoscope entry point

ఏం చేస్తారు..

కొన్ని రోజుల్లోనే మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. డిసెంబరు 31 అర్ధరాత్రి నుంచే ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ క్రమంలో రకరకాల చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తారు. పొరపాటున వాటిపై క్లిక్‌ చేస్తే.. ఇక అంతే సంగతులు.

ఏపీకే ఫైల్స్‌ పట్ల జాగ్రత్త..

ఏపీకే (ఆండ్రాయిడ్‌ ప్యాకేజీ కిట్‌) ఫైల్స్‌ రూపంలో మెసేజ్‌లు పంపిస్తారు. పొరపాటున దానిపై క్లిక్ చేస్తే.. మన ఫోన్‌లోని సమాచారం అంతా నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్‌ నంబర్లు, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఇతర ఫైల్స్‌ అన్నీ సైబర్ నేరగాళ్లు దోచేస్తారు. అందుకే నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పెరిగిన నేరాలు..

తెలంగాణలో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం సైబర్‌ నేరాలు 18 శాతం పెరిగాయి. ఎన్‌సీఆర్‌పీ ద్వారా వచ్చిన 1,14,174 ఫిర్యాదుల్లో బాధితులు రూ.1866.9 కోట్లు నష్టపోయారు. కంబోడియా కేంద్రంగా సాగుతున్న సైబర్‌ మోసాలకు.. చైనీయులు భారతీయులను ఉపయోగించుకుంటున్నారు. 19,653 సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో 1,057 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు.

ప్రైవేట్ ఉద్యోగులే టార్గెట్!

వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, నిజామాబాద్‌ కమిషనరేట్లలో సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ మోసాల్లో చిక్కుకునే వారు ఎక్కువగా ప్రైవేట్ ఉద్యోగులే ఉన్నారు. సైబర్ మోసగాళ్లు కూడా వారినే టార్గేట్ చేస్తున్నారు. తెలంగాణలో దాదాపు 56 శాతం ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ మోసగాళ్ల బాధితులే కావడం గమనార్హం.

Whats_app_banner