Hydra: ఉద్యోగులకూ హైడ్రా టెన్షన్.. ఆరుగురు అధికారులపై కేసు నమోదు.. త్వరలో మరికొందరిపై..
Hydra: హైడ్రా పేరు చెబితే ఇన్ని రోజులు అక్రమార్కులు వణికిపోయారు. ఇప్పుడు అధికారుల వంతు వచ్చింది. తాజాగా ఆరుగురు అధికారులపై హైడ్రా ఫిర్యాదు చేయగా.. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో మరికొందరిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం.
హైదరాబాద్‌లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై కేసు నమోదు అయ్యింది. ఆరుగురు ఆఫీసర్లపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీఏ ఏపీవో, బాచుపల్లి తహశీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై కేసు నమోదు అయ్యింది. ఈవోడబ్ల్యూలో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో మరికొందరు అధికారులపైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
మరికొందరు అధికారులపై..
హైదరాబాద్ పరిధిలోని చెరువు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. అయితే.. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర కూడా ఉందని హైడ్రా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్రమ కట్టడాలకు సహకరించిన వారి వివరాలు సేకరిస్తోంది. ప్రాథమికంగా ఆరుగురిని గుర్తించిన హైడ్రా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా కొంతమంది అధికారులపైనా హైడ్రా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
రాజేంద్రనగర్‌లో..
మరోవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ అప్ప చెరువు సమీపంలో.. బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు ప్రారంభించింది. రేపు ఆదివారం కావడంతో.. కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఎవరి కట్టడాలు కూలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.
సంగారెడ్డి జిల్లాకు రంగనాథ్..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలంలో ఉన్న పలు చెరువులను పరిశీలించనున్నారు. అమీన్‌పూర్‌లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలల్లో సర్వే చేసి.. అక్రమ నిర్మాణాలను గుర్తించనున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని రాంనగర్‌లో రంగనాథ్ పరిశీలనకు వెళ్లారు. ఆ తర్వాతి రోజే అక్రమ కట్టడాలను కూల్చివేశారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా కూల్చివేతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.