Data Theft Case: 16.8 కోట్ల మంది డేటా చోరీ.. దేశంలోనే అతిపెద్ద స్కామ్ బట్టబయలు!
stealing confidential bank data case: దేశంలో అతిపెద్ద అతిపెద్ద డేటా చోరీ కేసును బట్టబయలు చేశారు సైబరాబాద్ పోలీసులు. 16 కోట్ల 80 లక్షల మంది డేటా చోరీకి గురైనట్లు గుర్తించామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
Cyberabad Police Bust Indias Biggest Data Theft Case: వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు. 16.8 కోట్ల మందికిపైగా భారతీయుల డేటాను సేకరించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇందుకు సంబంధించిన ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం వెల్లడించారు. మొత్తం 16 కోట్ల 8 లక్షల మంది డేటా చోరీ చేశారని పేర్కొన్నారు. దేశ భద్రతకు డేటా చోరీతో ముప్పు ఉందన్న ఆయన... దేశ వ్యాప్తంగా ఉన్న డేటా బ్రోకర్స్ పై విచారణ చేస్తామని స్పష్టం చేశారు. యూనిఫారం సర్వీసెస్ లో అత్యoత గోప్యంగా ఉండాల్సిన వారి వివరాలు కూడా చోరీ అయ్యాయని వెల్లడించారు.
పలు రకాల ఆన్‌లైన్ వెబ్‌సైట్ల నుంచి డేటాను చోరీ చేసి ఈ ముఠా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నట్లు గుర్తించామని సీపీ చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగులు, పలు బ్యాంకింగ్ క్రెడిట్ కార్డులు, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటా చోరీ అయిందని వివరించారు. నాగ్‌పూర్, ఢిల్లీతోపాటు ముంబైకి చెందిన ముఠాగా గుర్తించినట్లు వెల్లడించారు. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించామన్నారు. బీమాతో పాటు రుణాల కోసం దరఖాస్తు చేసిన 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని పేర్కొన్నారు. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్‌వర్డ్‌లు కూడా లీకయ్యాయని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
అంత్యంత గోప్యంగా ఉండాల్సిన వివరాలు, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయని సీపీ రవీంద్ర ప్రకటించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని చెప్పారు. వీరి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కేసు విచారణ కోసం అంతర్గతంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సైబరాబాద్ పోలీస్ వింగ్. జాయింట్ సీపీ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో సిట్ పనిచేయనుంది. ఇంత స్థాయిలో డేటా ఎలా సేకరించారు..? వీరికి ఎవరెవరూ సహకరించారు..? ప్రధానంగా ఆర్మీ అధికారుల సమాచారం ఎలా చేరింది..? వంటి అంశాలపై సైబరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో మరిన్ని విషయాలు బయటికి వస్తాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
సంబంధిత కథనం