అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో గురువారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇవాళ ఉదయం కూడా భారీగానే వర్షం పడింది.
ఇవాళ హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా ఐటీ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
వాతావరణ శాఖ వెదర్ బులెటిన్ ప్రకారం…. శుక్ర, శనివారాల్లో నగరంలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన గాలులతో పాటు ఈదురు గాలులు (40 నుండి 50 కి.మీ) వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు.
ఇక హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి,చందానగర్, శేరిలింగంపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. వర్షాల కారణంగా ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ వివరాల ప్రకారం.. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
సంబంధిత కథనం