5G Fraud Alert : ఇక్కడ క్లిక్ చేసి 4జీ నుంచి 5జీకి మారండని లింక్ వచ్చిందా?-cyber police warn against switch from 4g to 5g links unleashed by fraudsters ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  5g Fraud Alert : ఇక్కడ క్లిక్ చేసి 4జీ నుంచి 5జీకి మారండని లింక్ వచ్చిందా?

5G Fraud Alert : ఇక్కడ క్లిక్ చేసి 4జీ నుంచి 5జీకి మారండని లింక్ వచ్చిందా?

Anand Sai HT Telugu
Oct 09, 2022 05:16 PM IST

5G Services In Hyderabad : టెక్నాలజీ దూసుకుపోతంది. ఈ మధ్యకాలంలోనే దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ లోనూ స్టార్ట్ అయ్యాయి. అయితే 5జీకి మారండంటూ లింక్స్ మీ ఫోన్స్ కు వస్తున్నాయా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

దేశంలోని పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అందులో హైదరాబాద్(Hyderabad) కూడా ఒకటి. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మీ మెుబైల్ 5జీకి సపోర్ట్ చేస్తుంది. ఈ లింక్ క్లిక్ చేసి.. మీ సేవలను కొనసాగించవచ్చు. ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. పొరబాటున వాటిని ఓపెన్ చేస్తే అంతేసంగతులు. మీ సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

సైబర్ నేరగాళ్లు(Cyber Crime) ఫైల్‌ల ద్వారా పంపే లింక్‌లు వ్యక్తిగత డేటాను ప్రమాదంలో పడేసే స్కామ్ లింక్‌లకు వినియోగదారులను తీసుకువెళతాయని సైబర్ నిపుణులు(Cyber Experts) తెలిపారు. దేశంలో 5G లాంచ్ అయిన కొద్ది రోజులకే 5G సేవల పేరుతో కస్టమర్లను మోసగించే సైబర్ నేరగాళ్లు పెరిగారని అధికారులు హెచ్చరిస్తున్నారు. దిల్లీ, ముంబై, హైదరాబాద్‌(Hyderabad)తో సహా 13 మెట్రో నగరాల్లోని మొబైల్ వినియోగదారులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 4G నుండి 5Gకి మారండి అనే లింక్‌లను ప్రజలకు పంపుతున్నారని అధికారులు తెలిపారు.

అయితే, APK (Android అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్‌ల ద్వారా పంపిన అటువంటి లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుల వ్యక్తిగత డేటాను ప్రమాదంలో పడే స్కామ్ లింక్‌లకు వినియోగదారులను తీసుకువెళతారని సైబర్ పోలీసులు(Cyber Police) హెచ్చరించారు. 'అవి మాల్‌వేర్ ఫైల్‌లు కాబట్టి, సైబర్‌ నేరగాళ్లకు రహస్య సమాచారాన్ని అందజేస్తూ సెల్‌ఫోన్‌(Cellphone)లోకి చొరబడతాయి. ఫోన్‌లో వ్యక్తిగత చిత్రాలు, ఇతర రహస్యాలు ఉంటే, సైబర్ నేరగాళ్లు వినియోగదారులను బ్లాక్ మెయిల్ చేయవచ్చు.' అని సైబర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

వాళ్లు పంపించే లింక్స్ క్లిక్ చేస్తే.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలలోని యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌(Password)లను కూడా హ్యాకింగ్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఏం చెబుతారంటే.. మీరు విలువైన కస్టమర్ అయినందున మేం మిమ్మల్ని ఎంచుకున్నామంటూ సందేశం పంపిస్తారు. 4G నుండి 5Gకి మార్చడానికి, మీరు సిమ్‌(SIM)ని మార్చాలి. కానీ అలాంటి అవసరం లేకుండా మేం మీకు అవకాశం ఇస్తున్నమని చెబుతారు. ఇదేదో బాగుంది కదా అని మీరు ఆవేశపడితే ఇక అంతే ముచ్చట. కాస్త ఉత్సాహం చూపించినా.. మీ వ్యక్తిగత సమచారం అంతా గోవిందా.

' ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు.. అవకాశం కోల్పోతారనే భావనతో అంగీకరిస్తారు. లింక్ మీద క్లిక్ చేస్తారు. నేరస్థులు UPI ID లేదా వారు పంపిన క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా నామమాత్రపు రుసుం చెల్లించమని సూచిస్తారు. మీరు ఆ కోడ్‌ను స్కాన్ చేసి, యూపీఐ ఐడీ(UPI ID) ద్వారా చెల్లింపులు చేసినామీ ఖాతాలోని మొత్తం డబ్బు నేరగాళ్ల ఖాతాకు బదిలీ అవుతోంది. అని సైబర్ పోలీసు అధికారి ఒకరు హెచ్చరించారు.

అయితే గతంలో 3జీ నుంచి 4జీ(3G to 4G)కి మారాలంటే.. కచ్చింతగా సిమ్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు టెలికాం కంపెనీలు టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. 4జీ సిమ్ నుంచే.. 5జీకి మారిపోవచ్చు. అలాఅని ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేస్తే.. మాత్రం మీరు సమస్యలు ఎదుర్కొంటారు.

5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇదే అదునుగా భావించే సైబర్‌ నేరగాళ్లు కొత్త స్కామ్‌లకు తెరలేపుతున్నారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు(Cyber Crime Police) చెబుతున్నారు. 4జీ నుంచి 5జీ మారండి మీకు కావాల్సిన సేవలు మేం అందిస్తామని లింక్స్ వస్తాయి. వాటిని అస్సలు తెరవకండి. మీకు క్లారిటీగా కావాలి అంటే కస్టమర్ కేర్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు.

సైబర్ నేరగాళ్లు చెప్పేదంతా నిజమని నమ్మిన కస్టమర్లు లింక్‌లను క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని డేటా(Phone Data) అంతా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. బ్యాంకు ఖాతాలకు లింక్‌ అయి ఉన్న ఫోన్‌నంబర్‌ ద్వారా.. డబ్బంతా దోచేస్తారు. 5జీ సర్వీస్‌లు అందిస్తామంటూ పలు ఛార్జీల పేరుతో డబ్బులు అందినంతా దండుకుంటారు. ఈ విషయంపై తగినంత జాగ్రత్తగా ఉండాలి. అనుమానం వస్తే.. పోలీసులకు చెప్పండి. లేదా కస్టమర్ కేర్(Customer Care) తో మాట్లాడండి.. జాగ్రత్త!

IPL_Entry_Point