Warangal MGM: వరంగల్ ఎంజీఎంలో కరెంట్ కష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు, కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Warangal MGM: నిరుపేదల పెద్దాసుపత్రి వరంగల్ ఎంజీఎంలో కరెంట్ కష్టాలు వీడటం లేదు. మంగళవారం రాత్రి పవర్ కట్ అయి ఆసుపత్రిలో వెంటిలేటర్లు, ఏసీలు పని చేయకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Warangal MGM: వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో కరెంటు కోతలతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొనగా, ఎన్పీడీసీఎల్ అధికారులు స్పందించి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. కాగా ఎంజీఎం ఆసుపత్రిలో విద్యుత్తు సంబంధ సమస్యలు తలెత్తడం, పేషెంట్లు ఇబ్బందులు పడుతున్న విషయం మీడియాలో వైరల్ కావడంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగానే స్పందించారు.
కౌంటర్ వేసిన మాజీ మంత్రి కేటీఆర్
వరంగల్ ఎంజీఎంలో కరెంట్ సమస్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగగా, ఆ విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. కరెంట్ కోతలు లేవని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పదే పదే ప్రగల్భాలు పలుకుతున్నారని, మరి ఆసుపత్రుల్లో కరెంట్ కోతలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ లో పర్యటించిన సందర్భంగా ఆయన ఎంజీఎం సమస్యపై మాట్లాడారు. ‘పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో ఐదు గంటల పాటు కరెంట్ లేదు. కానీ ఐదు గంటల పాటు కరెంట్ పోయి ఒక్క జనరేటర్ కూడా పని చేయకుంటే వెంటిలేటర్ పై ఉన్న నవజాత శిశువులు, ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంటి’ అని ప్రశ్నించారు. ఇదేనా మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌంటర్ వేశారు.
అధికారులను సంజాయిషీ కోరిన కలెక్టర్
ఆసుపత్రిలో విద్యుత్తు అంతరాయంపై క్షేత్ర స్థాయిలో పరిశీలనకు బుధవారం సాయంత్రం కలెక్టర్ ప్రావీణ్య ఎంజీఎంను పరిశీలించారు. కాగా ఆసుపత్రిలో అన్ని విభాగాలకు కరెంట్ సరఫరాను పునరుద్ధరించగా, డయాలసిస్ వింగ్ కు మాత్రం విద్యుత్తు సమస్య తీరలేదు.
ఆ వింగ్ లో ఉన్న జనరేటర్ పని చేయడం లేదని అక్కడి సిబ్బంది సమాధానం ఇవ్వగా, కలెక్టర్ అధికారులపై సీరియస్ అయ్యారు. సమస్య తలెత్తినప్పుడు అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తరచూ విద్యుత్తు సమస్యలు తలెత్తడానికి కారణాలు, ఎంజీఎంలోని జనరేటర్లు, ఇతర ఎలక్ట్రికల్ ఎక్విప్ మెంట్ పనితీరుపై సమగ్ర నివేదిక అందించాలని ఎన్పీడీసీఎల్ అధికారులను కోరారు.
అనంతరం డయాలసిస్ విభాగానికి చెందిన జనరేటర్ పని చేయక పోవడంపై సరైన సంజాయిషీ ఇవ్వాలని ఎంజీఎం ఆఫీసర్లనుఆదేశించారు. ఆడిట్ రిపోర్ట్ ప్రకారం భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కరెంట్ మెయింటెనెన్స్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
గతంలోనూ ఇదే పరిస్థితి
ఎంజీఎం ఆసుపత్రిలో కరెంట్ కష్టాలు కొత్తేమీ కాదు. గత డిసెంబర్ లో కూడా ఇలాగే సమస్యలు తలెత్తగా, షాట్ సర్క్యూట్ జరిగి ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయింది. దీంతో ఆసుపత్రికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయి ఎమర్జెన్సీ వార్డులతో పాటు ఏఎంసీ, సర్జికల్ వార్డుల్లో చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి.
అప్పటికే వెంటిలేటర్ల మీద కొంతమంది పేషెంట్లు ఉండగా.. పవర్ ప్రాబ్లం వల్ల అవన్నీ ఆగిపోయాయి. అప్పుడు కూడా జనరేటర్లు పనిచేయకపోవడం, వెంటిలేటర్లకు యూపీసీ సదుపాయం లేకపోవడంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్న కొంతమంది పేషెంట్లను పక్క వార్డులకు షిఫ్ట్ చేశారు.
ఈ క్రమంలోనే నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన భిక్షపతి అనే పేషెంట్ వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ తీసుకుంటుండగా, పవర్ ప్రాబ్లం వల్ల మెషీన్ పని చేయక ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి ప్రాణాలు కోల్పోయాడు. కానీ వెంటిలేటర్ ఆక్సిజన్ అందక భిక్షపతి ప్రాణాలు కోల్పోయాడనే విషయంలో వాస్తవం లేదని ఎంజీఎం డాక్టర్లు ఆ విషయాన్ని కొట్టి పారేయడం గమనార్హం. కాగా ఎంజీఎంలో తరచూ విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుండటంతో ఈ సమస్యుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం