IRCTC Hyd Kerala Tour : 7 రోజుల్లో కేరళను చుట్టేయండి-హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదిగో
IRCTC Hyd Kerala Tour Package : కేరళలోని ప్రముఖ పర్యటక ప్రదేశాలను కవర్ చేస్తూ ఐఆర్సీటీసీ 7 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రశాంతమైన హౌస్ బోట్ రైడ్, హిల్ స్టేషన్ లలో స్టే...మరెన్నో సుందరమైన ప్రదేశాలను ఈ టూర్ లో విజిట్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
IRCTC Hyd Kerala Tour Package : ప్రశాంతమైన హౌస్‌బోట్ రైడ్, మంత్రముగ్ధులను చేసే హిల్ స్టేషన్‌ల కోసం కేరళను తప్పక విజిట్ చేయాల్సిందే. కేరళలోని నాలుగు ప్రముఖ ప్రాంతాలతో పాటు మరెన్నో సుందరమైన టూరిస్ట్ ప్రదేశాలను కవర్ చేస్తూ ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి ఏడు రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. గజిబిజి జీవితానికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి, నూతనుత్తేజాన్ని నింపుకునేందుకు ఈ టూర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ టూర్ లో అలెప్పి, కొచ్చి, మున్నార్, తేక్కడి, కుమరకోమ్, తిరువనంతపురం ప్రాంతాలను కవర్ చేస్తారు. ప్యాకేజీ ప్రారంభం ధర రూ.34,850. తదుపరి టూర్ అక్టోబర్ 14న ప్రారంభం కానుంది.
టూర్ పర్యటన ఇలా : కొచ్చి - మున్నార్ - తేక్కడి - కుమరకోమ్ - త్రివేండ్రం (06 రాత్రులు/07 రోజులు)
పర్యటన ఇలా
1వ రోజు : హైదరాబాద్ - కొచ్చి
ఉదయం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి కొచ్చి చేరుకుంటారు. పర్యటకులను పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. భోజనం చేసిన తర్వాత, యూదుల ప్రార్థనా మందిరం, డచ్ ప్యాలెస్, చైనీస్ ఫిషింగ్ నెట్‌లను కవర్ చేస్తూ.. ఫోర్ట్ కొచ్చిని సందర్శిస్తారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్‌ను ఉంటుంది. రాత్రికి కొచ్చిలో బస చేస్తారు.
2వ రోజు : కొచ్చి - మున్నార్
హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ అనంతరం మున్నార్ (130 కి.మీ.)కి బయలుదేరతారు. మార్గమధ్యలో చీయపారా జలపాతాన్ని చూడవచ్చు. మున్నార్ చేరుకుని హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. అనంతరం టీ మ్యూజియాన్ని సందర్శిస్తారు. రాత్రికి మున్నార్‌లోనే బస చేస్తారు.
3వ రోజు : మున్నార్
మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండ్లా డ్యామ్ సరస్సు కవర్ చేసే మున్నార్‌లో టూర్ కొనసాగుతోంది.
4వ రోజు: మున్నార్ - తేక్కడి
తేక్కడికి బయలుదేరి వెళ్తారు(90 కి.మీ.). మార్గమధ్యలో స్పైస్ ప్లాంటేషన్లను సందర్శిస్తారు. రాత్రికి తేక్కడిలో బస చేస్తారు.
5వ రోజు : తేక్కడి - కుమరకోమ్
అలెప్పి/కుమారకోమ్ (130 కి.మీ.)కి బయలుదేరతారు. అలెప్పిలో సొంత ఖర్చుతో బ్యాక్ వాటర్స్ రైడ్ చేయవచ్చు. రాత్రికి అలెప్పి/కుమారకోమ్‌లో బస చేస్తారు.
6వ రోజు : కుమరకోమ్ - త్రివేండ్రం
బ్రేక్ ఫాస్ట్ అనంతరం చడియమంగళం (115 కి.మీ.)కి బయలుదేరతారు. జటాయు ఎర్త్ సెంటర్‌ని సందర్శిస్తారు. అనంచకం త్రివేండ్రం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రికి త్రివేండ్రంలో బస చేస్తారు.
రోజు 7 : త్రివేండ్రం - హైదరాబాద్
ఉదయాన్నే శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. నేపియర్ మ్యూజియం, అజిమల శివ విగ్రహాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం హైదరాబాద్‌కు ఫ్లైట్ ఎక్కేందుకు త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. దీంతో పర్యటన ముగుస్తుంది.
క్లాస్ | సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు) | చైల్డ్ వితవుట్ బెడ్(2-4 సంవత్సరాలు) |
కంఫర్ట్ | రూ 53400 | రూ 37000 | రూ 34850 | రూ 30600 | రూ 25550 | రూ 17700 |