TS CSE Demand: ఆ బ్రాంచికే డిమాండ్.. కంప్యూటర్ సైన్స్ సీట్లన్నీభర్తీ…
TS CSE Demand: తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్‌లో కంప్యూటర్ సైన్స్ సీట్లు హాట్ కేకుల్లా భర్తీ అవుతున్నాయి. మొత్తం అందుబాటులో ఉన్న సీట్లలో 98.70శాతం భర్తీ అయ్యాయి. మొదటి విడత కౌన్సిలింగ్ సీట్లు దక్కిన వారు జులై 22వ తేదీలోపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

TS CSE Demand: తెలంగాణలో ఎంసెట్ తొలివిడత కౌన్సిలింగ్‌లో 70,665సీట్లను విద్యార్ధులకు కేటాయించారు. కంప్యూటర్, ఐటీ కోర్సులకే విద్యార్దులు మొగ్గు చూపించారు. సివిల్, మెకానికల్ వంటి కోర్సులకు పెద్దగా ఆదరణ దక్కలేదు. సగానికి పైగా సీట్లు ఖాళీలు ఉండిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31 కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఈ ఏడాది ఎంసెట్ కౌన్సిలింగ్‌లో విద్యార్దులు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ బ్రాంచికే జై కొట్టారు. కౌన్సిలింగ్‌లో అత్యధిక శాతం విద్యార్ధులుకంప్యూటర్ సైన్స్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ బ్రాంచీలో 98.70% సీట్లు భర్తీ అయ్యాయి.
సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీల్లో 94.20% సీట్లు నిండాయి. సీఎస్‌ఈలో రాష్ట్ర వ్యాప్తంగా 23,467 సీట్లు అందుబాటులో ఉంటే 23,162 సీట్లు భర్తీ అయ్యాయి.ఈ కోర్సులో 305 మాత్రమే మిగిలాయి.
సీసీఎస్‌ఈ, ఐటీ అనుబంధ బ్రాంచీల్లో అందుబాటులో ఉన్న 55,876 సీట్లలో 52,637 భర్తీ అయ్యాయి. వీటిలో ింకా 3,239 సీట్లు మాత్రమే మిగిలాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంబంధిత బ్రాంచీల్లో 17,274కు గాను 13,595 సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ విభాగాల్లో 8,261 సీట్లకు 3,642 మాత్రమే నిండాయి. వీటిలో సగానికంటే తక్కువే సీట్లు భర్తీ అయ్యాయి.
జులై 22లోగా ఫీజు చెల్లించాలి….
తొలి విడత కౌన్సిలింగ్‌లో ఇంజనీరింగ్ సీట్లు పొందిన వారు ఈనెల 22వ తేదీ లోపు అలాట్‌మెంట్ లెటర్‌లో పేర్కొన్న విధంగా ట్యూషన్ ఫీజును ఎంసెట్ వెబ్‌సైట్ నుంచే చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అప్పుడే వారికి సీటు దక్కుతుంది.
ఫీజులు చెల్లించిన తర్వాతే రెండో విడతలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకొని మెరుగైన కళాశాలల్లో సీట్ల కోసం పోటీపడొచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత సీటు వద్దనుకుంటే రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమయ్యేలోగా రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసుకున్న వారికి పూర్తి ఫీజు వెనక్కి ఇస్తారు.
రెండో విడతలో ఎక్కువ ఫీజు ఉన్న కళాశాలలో సీటు వస్తే, పెరిగిన మొత్తాన్నిమళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ ఫీజు ఉన్న కళాశాలలో సీటు దక్కితే అదనంగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు. చివరి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఆ మొత్తం అందుతుంది. విద్యార్థులు తమ కుటుంబ సభ్యుల ఖాతాల నుంచి ఫీజు చెల్లించాలని, ఫీజు వెనక్కి ఇవ్వాల్సి ఉంటే అవే ఖాతాల్లోనే జమ అవుతాయని అధికారులు వివరించారు. మొదటి విడతలో దక్కిన సీటు అవసరం లేదనుకుంటే అసలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రెండో విడతలో కూడా వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణలో 3 వర్సిటీ కాలేజీలు, 28 కళాశాలల్లో 100% సీట్లు నిండాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 85.12% భర్తీ అయ్యాయి. 155 ప్రైవేటు కళాశాలల్లో 85.71% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా సీట్లకు 10% అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయించారు. మొత్తం 82,666 సీట్లలో 8,266 ఈ కోటాలో ఉంటే 5,576 మందికి సీట్లు దక్కాయి.ధ్రువపత్రాల పరిశీలనకు 76,821 మంది హాజరయ్యారు. 75,708 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. తొలి విడతలో 70,665 ఇంజనీరింగ్ సీట్లు కేటాయించారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చినా 5,043 మందికి సీట్లు రాలేదు.