Warangal : వరుస హత్యలు.. దోపిడీలు, దొంగతనాలు.. వణికిపోతున్న ఓరుగల్లు!-crime rate is increasing in warangal police commissionerate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : వరుస హత్యలు.. దోపిడీలు, దొంగతనాలు.. వణికిపోతున్న ఓరుగల్లు!

Warangal : వరుస హత్యలు.. దోపిడీలు, దొంగతనాలు.. వణికిపోతున్న ఓరుగల్లు!

Basani Shiva Kumar HT Telugu
Dec 06, 2024 10:49 AM IST

Warangal : వరంగల్.. ప్రశాంతతకు మారుపేరు. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు సీన్ మారింది. కారణాలు ఏమైనా క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలతో ఓరుగల్లు ప్రజలు వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘటనలు జరగడంతో భయాందోళనకు గురవుతున్నారు.

వరంగల్ క్రైమ్
వరంగల్ క్రైమ్ (istockphoto)

వరంగల్ నగర రూపురేఖలు మారిపోతున్నాయి. ఊహించని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం కావడంతో.. ప్రభుత్వం వరంగల్‌పై ఫోకస్ పెట్టింది. భారీగా నిధులు కేటాయిస్తూ.. అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తోంది. ఈ నేపథ్యంలో.. వరుసగా జరుగుతున్న నేరాలు చర్చనీయాంశంగా మారాయి.

yearly horoscope entry point

ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయి. గతంలో జరిగినా.. వాటిని పోలీసులు ఛేదించారు. కానీ.. ఇటీవల జరుగుతున్న నేరాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఎవరు ఎందుకు హత్య చేస్తున్నారో.. ఎవరిని చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు అసలు హతుడు ఎవరు.. నిందితుడు ఎవరనేది కనుక్కోవడం సవాల్‌గా మారింది.

ఇటీవల జరిగిన హత్యలు..

ఈనెల 3న హనుమకొండ శ్రీన‌గ‌ర్ కాల‌నీకి చెందిన రిటైర్డ్‌ బ్యాంకు మేనేజ‌ర్ రాజమోహన్‌ను.. అత్యంత దారుణంగా చంపేశారు. త‌న కారులోనే తాళ్లతో క‌ట్టేసి క‌త్తుల‌తో పొడిచి హత్య చేశారు.

ఈనెల 3న కాజీపేటకు మాలకొండయ్య అనే 70 ఏళ్ల వృద్ధుడిపై క‌త్తితో దాడి జరిగింది. దుండగులు మాల‌కొండ‌య్య కొడుకుపైనా పెట్రోల్ ప్యాకెట్లను విసిరారు. ఇది ప‌క్కగా ప్లాన్ ప్రకారం జ‌రిగిన‌ట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల పరకాల మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన మేకల యుగంధర్​(35)ను అత్యంత దారుణంగా గొడ్డళ్ల‌తో న‌రికి చంపారు.

చెన్నారావుపేట మండలం పదహారు చింతల్‌‌తండాలోని బానోతు శ్రీనివాస్‌ (40) బానోతు సుగుణ(35) దంపతులను ఓ యువకుడు దారుణందా న‌రికి చంపాడు. దీనికి ప్రేమ, పెళ్లి కారణం.

గ‌త ఏడాది డిసెంబ‌ర్‌‌లో కాజీపేటలోని రహమత్‌నగర్‌కు చెందిన క‌న్నె విజ‌య‌(68)ను హత్య చేశారు. ఇంటికి స‌మీపంలో రోడ్డుపై ఆమె విగ‌త‌జీవిగా ప‌డి ఉంది.

బ్యాంక్ చోరీ..

రాయ‌ప‌ర్తి ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులోని లాకర్​ను తెరిచి రూ.19 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాల హార్డ్​డిస్క్​ల కూడా ఎత్తుకెళ్లిపోయారు.

అత్యాచారం..

హనుమకొండకు సమీపంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన సుమన్​ అనే యువకుడు.. జులై 20న ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. భయాందోళనకు గురైన బాలిక దుండగుడి చేతిని కొరికి తప్పించుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కారణాలు ఏంటీ..

ఇటీవల జరిగిన, గతంలో జరిగిన హత్యలకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువగా ఆర్థికపరమైన వివాదాలతోనే నేరాలు జరుగుతున్నాయని.. ఓ ఏసీపీ 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు'తో చెప్పారు. ఆ తర్వాత అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల కారణంగా క్రైమ్ జరుగుతున్నట్టు వివరించారు. వీటి కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

Whats_app_banner