Warangal Betting: ఐపీఎల్ సీజన్ వేళ పోలీసులు బెట్టింగ్ దందాపై నిఘా పెంచారు. వరంగల్ పోలీసులు ఏపీకి చెందిన ఒక క్రికెట్ బెట్టింగ్ బుకీని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.లక్షన్నర నగదు, రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకో ప్రధాన బుకీ పరారీలో ఉండగా, తొందర్లోనే అతడిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు బుకీ అరెస్టుకు సంబంధించిన వివరాలను హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి ఆదివారం హనుమకొండ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వీరమణి కుమార్ అలియాస్ పండు అనే యువకుడు 2023లో గోవాకు వెళ్లాడు. అక్కడ హైదరాబాద్ కు చెందిన యోగేశ్ గుప్తా అలియాస్ జోగేశ్ గుప్తా అనే వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య మాటలు కలవగా.. యోగేశ్ గుప్తా ఆన్ లైన్ వేదికగా నిర్వహించే క్రికెట్ బెట్టింగ్ గురించి వీరమణి కుమార్ కు వివరించాడు.
బెట్టింగ్ నిర్వహిస్తే వచ్చే డబ్బులో 9 శాతం కమీషన్ ఇస్తానని చెప్పాడు. అంతేగాకుండా బెట్టింగ్ డబ్బులు జమ చేసేందుకు బ్యాంక్ ఖాతా నెంబర్లు ఇస్తే ఇంకో 1శాతం కమీషన్ కూడా వస్తుందని వీరమణి కుమార్‌కు యోగేశ్ గుప్తా వివరించాడు. మొత్తంగా 10 శాతం కమీషన్ వస్తుండటంతో వీరమణి కుమార్ బెట్టింగ్ నిర్వహణకు ఓకే చెప్పాడు.
అనంతరం యోగేశ్ గుప్తా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ నకు సంబంధించిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ క్రియేట్ చేసి వీరమణి కుమార్ కు లాగిన్ ఇచ్చాడు. దాని ద్వారా వీరమణి కుమార్ బెట్టింగులు నిర్వహించడం మొదలు పెట్టి, బుకీ అవతారమెత్తాడు.
బెట్టింగ్ అమౌంట్ జమ అయ్యేందుకు యోగేశ్ గుప్తా సూచన మేరకు వీరమణి కుమార్ తనతో పాటు తన స్నేహితులకు సంబంధించిన బ్యాంక్ ఖాతా నెంబర్లను యోగేశ్ గుప్తాకు అప్పగించాడు. ఈ మేరకు బెట్టింగులు నిర్వహించగా.. దాదాపు రూ.5 కోట్ల వరకు ఆయా ఖాతాల్లో జమ అయ్యాయి.
అందులో దాదాపు రూ.3 కోట్లను యోగేశ్ గుప్తాకు సంబంధించిన ఖాతాలకు పంపించాడు. ఇంకో రెండు కోట్లు ఉండగా.. అందులో ఒక రూ.కోటి బెట్టింగ్ ఆడిన పంటర్లకు ఇచ్చారు. ఆ తరువాత తన వద్ద ఇంకో రూ.కోటి ఉండగా, కాకినాడ సమీపంలోనే ఒక ఇంటి ప్లాట్ తో పాటు రెండు వైన్స్ షాపులు కూడా తీసుకున్నాడు.
ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కావడంతో వరంగల్ పోలీసులు బెట్టింగ్ పై నిఘా పెంచారు. ఈ క్రమంలోనే గత నెల 25వ తేదీన హనుమకొండ పద్మాక్షి ఆలయం సమీపంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న చింతపండు కృష్ణ, మేడిషెట్టి నరేశ్, పులి ఓంకార్, పల్లపు సురేశ్ అనే నలుగురు వ్యక్తులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.58 లక్షల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆ తరువాత వారిని విచారణ జరపగా.. అసలు బుకీల విషయం బయటపడింది. వారిపై వీరమణి కుమార్ బుకీగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం వీరమణి కుమార్ హనుమకొండకు వచ్చినట్లు ఉప్పందడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.లక్షన్నర నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వీరమణి కుమార్ కు గోవాలో పరిచయం అయిన యోగేశ్ గుప్తా ప్రధాన బుకీ కాగా.. ఆయన ద్వారానే వీరంతా బెట్టింగ్ దందా నిర్వహించేవారు. ఈ కేసులో సబ్ బుకీగా ఉన్న వీరమణి కుమార్, పంటర్లుగా ఉన్న చింతపండు కృష్ణ, మేడిషెట్టి నరేశ్, పులి ఓంకార్, పల్లపు సురేశ్ అరెస్ట్ అయ్యారు.
హైదరాబాద్ కు చెందిన ప్రధాన బుకీ యోగేశ్ గుప్తా, మరో పంటర్ హనుమకొండ కుమ్మరివాడకు చెందిన కేతిరి రంజిత్ కూడా పరారీలో ఉన్నట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. తొందర్లోనే వారిని కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన హనుమకొండ సీఐ సతీశ్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని ఏసీపీ దేవేందర్ రెడ్డి అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం