CPI Kothagudem : కొత్తగూడెంలో కూనంనేనికి అసమ్మతి సెగ - బీసీకి టికెట్ ఇవ్వాలంటున్న కౌన్సిలర్లు
Telangana Assembly Elections 2023: సీపీీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు టికెట్ ఇవ్వొద్దనే వాదన తెరపైకి వస్తోంది. ఈసారి బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి టికెట్ ఇవ్వాలంటూ స్థానిక కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.
Telangana Assembly Elections 2023: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సొంత పార్టీలోనే అసమతి సెగ తగిలింది. కొత్తగూడెం స్థానాన్ని ఎప్పుడూ ఓసీ అయిన కూనంనేనికే కేటాయించడం సరికాదని కౌన్సిలర్లు అసమ్మతి రాగం వినిపించారు. ఈ మేరకు కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లు 8 మంది రహస్యంగా సమావేశమై మంతనాలు జరిపారు. కాంగ్రెస్ ఒకవేళ పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని కేటాయించినప్పటికీ ఇక్కడి నుంచి జిల్లా కార్యదర్శి, బీసీ వర్గానికి చెందిన ఎస్ కె.షాబ్బీర్ పాషను పోటీకి నిలపాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణానికి చెందిన సాంబశివరావు ప్రతిసారి పోటీ చేయడంపై వారు కినుక వహించారు.
అసలు కూనంనేని స్థానికుడు కానేకాదని, ఆయన ఎలా పోటీకి నిలుస్తారని ప్రశ్నించారు. "రాష్ట్ర కార్యదర్శి వద్దు - జిల్లా కార్యదర్శి ముద్దు" అంటూ కౌన్సిలర్లు నినదించారు. కూనంనేని పొత్తులో భాగంగా సీటు వచ్చి పోటీ చేసినా, లేక పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ తాము సిపిఐ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో ఒక సీటు కోసం వెంపర్లాడుతున్న తీరుపై కూడా వారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు అన్నట్లు వ్యవహరిస్తూ గొప్ప చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కొత్తగూడెం నియోజకవర్గం సీటును బీసీ నాయకుడైన ఎస్ కే షాబీర్ పాషాకు కేటాయిస్తే సరేసరి.. లేకుంటే ఎర్రజెండా పార్టీకి రాజీనామా తప్పదని వారు అల్టిమేట్ జారీ చేశారు.
మరోవైపు సీపీఐ - కాంగ్రెస్ పార్టీ పొత్తుపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లే చెబుతున్నారు. ఇక కొత్తగూడెం సీటుపై కాంగ్రెస్ కూడా ప్రకటన చేయలేదు. చెన్నూరు, కొత్తగూడెం సీటు విషయంపై కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ… తాజాగా చెన్నూరు విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగూడెం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు సీపీయం పార్టీ…కాంగ్రెస్ తో పొత్తుకు గుడ్ బై చెప్పేసింది. సొంతగానే బరిలోకి దిగుతామని చెప్పటమే కాకుండా… 17 స్థానాలను కూడా ప్రకటించింది. ఈ మేరకు తమ్మినేని పలు వివరాలను కూడా వెల్లడించారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
సంబంధిత కథనం