Jayashankar Dt Crime: ప్రేమ వివాహానికి సహకరించాడని హత్య.. యువకుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు-court sentences young man to life imprisonment for murder for aiding in love marriage ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jayashankar Dt Crime: ప్రేమ వివాహానికి సహకరించాడని హత్య.. యువకుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు

Jayashankar Dt Crime: ప్రేమ వివాహానికి సహకరించాడని హత్య.. యువకుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు

HT Telugu Desk HT Telugu

Jayashankar Dt Crime: సోదరి ప్రేమ వివాహానికి సహకరించాడనే అనుమానంతో ఇసుక క్వారీలో పనిచేసే వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన యువకుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.

హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు

Jayashankar Dt Crime: అక్క ప్రేమ వివాహానికి సహకరించాడనే అనుమానంతో ఇసుక క్వారీలో పని చేస్తున్న ఓ వ్యక్తిని యువతి తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో నరికి ప్రాణాలు తీశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపగా.. ఈ కేసులో యువతి తమ్ముడిని దోషిగా తేలుస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణ హత్యకు పాల్పడిన యువకుడికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా సీతానాగారం గ్రామానికి చెందిన సంగిశెట్టి కిశోర్(22) భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి ఇసుక క్వారీలో సూపర్ వైజర్ గా పని చేసేవాడు.

తన స్నేహితుడు విజయనగరం జిల్లాకు చెందిన చోడవరపు నర్సింహమూర్తి అదే ఇసుక క్వారీ ఇన్ చార్జిగా పని చేస్తుండేవాడు. నర్సింహమూర్తి మహదేవపూర్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన గోగుల లలిత అనే యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో 2018లో నర్సింహమూర్తి, గోగుల లలిత ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకునేందుకు విజయనగరం వెళ్లారు.

గొడ్డలితో నరికి హత్య

చోడవరపు నర్సింహమూర్తి, గోగుల లలిత ప్రేమ వివాహం చేసుకోవడానికి సంగిశెట్టి కిశోర్ సహకరించాడని, సదరు యువతి తమ్ముడు గోగుల విజయ్ అతడిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2018 ఆగస్టు 26వ తేదీన రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కిశోర్ ఇసుక క్వారీ వద్ద ఉండగా విజయ్ అక్కడికి వెళ్లాడు. అతడితో గొడవ పడి కిశోర్ ను గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో మృతుడి తండ్రి సంగిశెట్టి దుర్గారావు ఆ మరునాడు 27వ తేదీన మహదేవ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

జీవిత ఖైదు విధించిన కోర్టు

సంగిశెట్టి దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అప్పటి ఎస్సై డి. విజయ్ కుమార్ నిందితునిపై హత్యా కేసు నమోదు చేశాడు. ఆ తరువాత అప్పటి మహదేవ్ పూర్ సీఐగా ఉన్న ఎం. రంజిత్ కుమార్ నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం ఆయన బదిలీ కాగా ఆ తరువాత సీఐగా వచ్చిన అంబటి నర్సయ్య నిందితుడిపై సరైన సాక్ష్యాధారాలతో కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు.

ఈ మేరకు లైజన్ ఆఫీసర్ గాండ్ల వెంకన్న ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్లు కె. వినోద్, కె.రమేశ్ కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. దీంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ మేరకు నిందితునిపై నేరం రుజువు కావడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. నారాయణబాబు నిందితుడికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

సరైన సమయంలో సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టడానికి కృషి చేసిన ప్రస్తుత కాటారం డీఎస్పీ రాంమోహన్ రెడ్డి, సీఐ రాంచందర్ రావు, ఎస్సై పవన్ కుమార్ తో పాటు అప్పటి ఎంక్వైరీ ఆఫీసర్లు, కోర్టు లైజన్ ఆఫీసర్, కోర్టు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk

సంబంధిత కథనం