Courier Scams : కొరియర్ స్కామ్ ల పట్ల అప్రమత్తంగా ఉండండి, ఫెడెక్స్ సూచనలు
Courier Scams : కొరియర్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఫెడెక్స్ సంస్థ తెలిపింది. ఈ మేరకు పలు కీలక సూచనలు చేసింది. ఫెడెక్స్ లేదా ఇతర కొరియర్ సంస్థల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Courier Scams : ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. మీ కొరియర్ లో అక్రమ వస్తువులు ఉన్నాయంటూ ఫోన్ చేసి డబ్బు కాజేసేందుకు ప్రయత్నిసున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రముఖ కొరియర్ సంస్థ ఫెడెక్స్... ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఫెడెక్స్ ఉద్యోగుల పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ తరహా మోసాలతో బాధితులు ఆర్థికంగా, మానసిక నష్టపోతున్నారని పేర్కొంది.
మోసాలు ఎలా జరుగుతున్నాయి?
ఆర్థిక మోసగాళ్లు ఫెడెక్స్ లేదా ఇతర కొరియర్ సంస్థల ప్రతినిధులుగా చెబుతూ... మీ పార్సెల్‌లో అక్రమ వస్తువులు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తారు. బాధితులను నకిలీ పోలీస్ అధికారులతో బెదిరించి, న్యాయపరమైన చర్యలు లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే తక్షణమే డబ్బు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఒత్తిడి తెస్తారు. వెంటనే డబ్బు పంపాలని, లేకపోతే అరెస్టు చేస్తామని హడావుడి చేస్తారు. ముందు కొంత మొత్తం చెల్లించాలని ఓ లింక్ పంపుతారు. డబ్బులు పంపిస్తే ...ఇక మోసగాళ్లు అదృశ్యమవుతారు. బాధితులు పూర్తిగా నష్టపోతారు.
ఫెడెక్స్ సూచనలు
ఫెడెక్స్ ఎప్పుడూ అనవసరమైన ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం లేదా అకౌంట్ వివరాలు కోరదు. ఫెడెక్స్ పోలీసు అధికారులతో ఎలాంటి సంబంధం కలిగి ఉండదు. వారి తరఫున చర్యలు తీసుకోదు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఫెడెక్స్ లేదా ఇతర కొరియర్ సంస్థల పేరుతో బెదిరింపులు వచ్చినా నమ్మవద్దు. ఎవరైనా ఫెడెక్స్ లేదా కొరియర్ సంస్థల పేరిట బెదిరిస్తూ డబ్బు అడిగితే, వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి తెలియజేయండి. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయండి.
ముఖ్యమైన చిట్కాలు
- ఫెడెక్స్ లేదా ఇతర కొరియర్ సంస్థల పేరుతో అనవసరమైన సందేశాలు, కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- ఏమైనా అనుమానాస్పద సమాచారం ఉంటే, అధికారిక కస్టమర్ కేర్ ద్వారా నిర్ధారించుకోవాలి.
- పూర్తి సమాచారం తెలుసుకునే వరకు, డబ్బులు పంపకండి లేదా వ్యక్తిగత సమాచారం తెలియజేయవద్దు.
- మోసాలకు గురైతే, స్థానిక పోలీసులకు తెలియజేయండి లేదా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.
సంబంధిత కథనం