Sirisilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాటు తుపాకుల తయారీ కలకలం.. ముగ్గురు నిందితుల అరెస్ట్
Sirisilla Crime: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపాయి. తుపాకులను తయారు చేసే వ్యక్తితో పాటు వాటిని ఉపయోగించే మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కంట్రీ మేడ్ తుపాకులతో పాటు మూడు ఐరన్ బారెల్, 4 ట్రిగ్గర్లు ముడిసరుకులు స్వాధీనం చేసుకున్నారు.
Sirisilla Crime : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాటు తుపాకుల తయారు గుట్టు రట్టయ్యింది. నాటు తుపాకులు తయారు చేసే వ్యక్తితో పాటు ఆ తుపాకులతో వన్యప్రాణులను వేటాడే మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కంట్రీ మేడ్ విఫన్, మూడు ఐరన్ బారెల్, 4 స్టిగ్గర్, కత్తి, రంపము, సుత్తే, ఆకు రాయి, డ్రిల్లింగ్ మిషన్ ,దూగోడ మిషన్, ఎయిర్ బుల్లోజర్ స్వాధీనం చేసుకున్నారు.
సిరిసిల్ల లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమక్షంలో పట్టుబడ్డ ఆయుధాలను చూపించి వివరాలు వెల్లడించారు. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేస్తున్నాడు. అలా చేసిన తయారు ఆయుధాలను వన్యప్రాణులను వేటాడేందుకు విక్రయిస్తున్నాడు.
ఆయుధాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో గంభీరావుపేట ఎస్ఐ సిబ్బందితో రాయలింగు శంకర్ ఇంటికి వెళ్ళి తనిఖీ చేయగా ఆయుధాలు, వాటి తయారుకు ఉపయోగించే పరికరాలు లభించాయని ఎస్పీ తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా వాటిని వన్య ప్రాణులను వేటాడేందుకు ఉపయోగిస్తున్నట్లు తేలిందన్నారు.
నాటు తుపాకులతో వన్య ప్రాణుల వేట…
రాయలింగు శంకర్ తయారు చేసిన నాటు తుపాకులను గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు చంద్రమౌళి, శాతవేణి హరీష్, లోగిడి గంగయ్య కొనుగోలు చేసి వన్య ప్రాణుల వేటకు ఉపయోగిస్తున్నట్లు తేలింది. శంకర్ వద్ద కొనుగోలు చేసిన ఆయుధాలతో వన్య ప్రాణులను వేటాడారని ఎస్పీ తెలిపారు.
ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా రెండు తుపాకి బ్యారెల్, తుపాకుల తయారు చేయడానికి వాడే రంపము, సుత్తి, కత్తి, ఆకు రాయి, డ్రిల్లింగ్ మిషన్ ,దూగోడ మిషన్, ఎయిర్ బుల్లోజర్ లభించాయని తెలిపారు. నలుగురిపై అక్రమంగా ఆయుధాల తయారు వినియోగంపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
నాటు తుపాకులు శంకర్ తయారు చేయగా ముగ్గురు మాత్రమే కొనుగోలు చేసి వినియోగించారని ఇతరులకు అమ్మినట్లు ఇంకా దాఖలాలు లేవని ఎస్పీ స్పష్టం చేశారు.
పట్టుకున్న పోలీసులను అభినందించిన ఎస్పీ..
నాటు తుపాకుల తయారీ, వన్యప్రాణుల వేట గుట్టు రట్టు చేసిన పోలీసులను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. నింధుతులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శ్రీనివాస్, గంభీరావుపేట ఎస్.ఐ రామ్మోహన్, సిబ్బందిని అభినందించి అక్రమ దందాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
గంజాయి విక్రేత అరెస్ట్..100 గ్రాముల గంజాయి స్వాధీనం
ముస్తాబాద్ లో గంజాయి విక్రయించేందుకు యత్నించిన వేములవాడ మండలం జయ్యారం గ్రామనికి చెందిన డప్పుల వంశీ ని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి వంద గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ వంశీ గంజాయి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించి ముస్తాబాద్ లో అమ్మేందుకు వెళ్ళగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారని అతని వద్ద 100 గ్రాముల గంజాయి, ఒక యాక్టివా స్కూటీ, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని అతన్ని రిమాండ్ కూ తరలించినట్లు పోలీసులు తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)