Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం.. కేసీఆర్ కలలు నెరవేరవు: చేవెళ్ల సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు-countdown for brs government has begun amit shah at chevella vijay sankalp sabha ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Countdown For Brs Government Has Begun Amit Shah At Chevella Vijay Sankalp Sabha

Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం.. కేసీఆర్ కలలు నెరవేరవు: చేవెళ్ల సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 23, 2023 08:38 PM IST

Amit Shah: బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. చేవెళ్ల వేదికగా జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం.. కేసీఆర్ కలలు నెరవేరవు: చేవెళ్ల సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు (Photo: BJP Telangana)
Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం.. కేసీఆర్ కలలు నెరవేరవు: చేవెళ్ల సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు (Photo: BJP Telangana)

Amit Shah: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, కేసీఆర్‌ను గద్దె దింపే వరకు పోరాటం సాగిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ (BJP) నేత అమిత్ షా అన్నారు. బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన విజయ సంకల్ప సభ(Vijay Sankalp Sabha)లో అమిత్ షా ప్రసంగించారు. ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించారు. భారత్ మాతాకీ జై అంటూ ఆయన ప్రసంగం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామని ఆయన అన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా వాడుకుంటోందని విమర్శించారు. దేశానికి ప్రధాని కావాలన్న కేసీఆర్ కల ఎప్పటికీ నెరవేరబోదని అమిత్ షా అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ముస్లిం రిజర్వేషన్లు వారికి..

Amit Shah: తెలంగాణలో ముస్లింలకు అమలు చేస్తున్న అనధికార రిజర్వేషన్లను తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని అమిత్ షా అన్నారు. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్‍టీ, బీసీలకు కేటాయిస్తామని అన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. ఓవైసీ అజెండాను తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తోందని ఆరోపించారు.

అరెస్టులకు భయపడేది లేదు

Amit Shah: 10వ తరగతి పేపర్ లీకేజీ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ను అరెస్ట్ చేయడం పట్ల అమిత్ షా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు అరెస్టులకు భయపడరని, పోరాడుతూనే ఉంటారని అన్నారు. “జైలులో పెడితే భయపడతారని ఆయన (కేసీఆర్) అనుకుంటున్నారు. కేసీఆర్ విను.. మీ వేధింపులకు మా కార్యకర్తలు అసలు భయపడరు. మిమ్మల్ని గద్దె దింపే వరకు మా పోరాటం అసలు ఆగదు” అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో పోలీసులను పూర్తిగా రాజకీయంగా మార్చేశారని ఆయన ఆరోపించారు.

టీఎస్‍పీఎస్‍సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. యువత జీవితాలతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నారని, పేపర్ లీకేజీపై మౌనంగా ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పేరు మార్పు అందుకే..

Amit Shah: “ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‍గా కేసీఆర్ మార్చారు. తెలంగాణలోనే కేసీఆర్ పని అయిపోనుంది. కానీ ఆయన దేశం గురించి మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. అక్కడ.. ఇక్కడ.. తిరుగుతున్నారు. తెలంగాణ ప్రజలు అంతా అర్థం చేసుకుంటున్నారు. ప్రధాన మంత్రి కుర్చీ ఖాళీ లేదు. ఆ పీఠాన్ని మళ్లీ నరేంద్ర మోదీనే అధిష్టించనున్నారు” అని అమిత్ షా అన్నారు.

కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా..

Amit Shah: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను బీఆర్ఎస్ పార్టీ దోచుకుంటోందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలు సామాన్య ప్రజలకు అందకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని అమిత్ షా ఆరోపించారు.

కాగా, బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇటీవల తనను అరెస్టు చేసి 8 గంటల పాటు పోలీసులు తిప్పారని, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదని అన్నారు. కార్యకర్తలను కాపాడే పులి అంటూ అమిత్ షాను అభివర్ణించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే ఆరుణ సహా బీజేపీ ముఖ్యనేతలు ఈ సభకు హాజరయ్యారు.

IPL_Entry_Point