తెలుగు న్యూస్ / తెలంగాణ /
Hyderabad New Osmania Hospital : నగరంలో ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణం - 10 ముఖ్యమైన విషయాలు
New Osmania General Hospital in Hyderabad : నయా ఉస్మానియా దవాఖానకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇటీవలనే గోషామహాల్ వేదికగా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. వచ్చే వందేళ్లకు సేవలందించేలా ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ కొత్త ఆస్పత్రి విశేషాలు, ప్రత్యేకతలెంటో ఇక్కడ తెలుసుకోండి…
కొత్త ఉస్మానియా ఆస్పత్రి నమూనా
వందేళ్ల పాటు సేవలందించేలా కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి తెలంగాణ సర్కార్ ముందడుగు వేసింది. ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ ఆస్పత్రి నిర్మాణం తెలంగాణ రాష్ట్ర వైద్య చరిత్రలో మరో కీలక మలుపు అని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కొత్త నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే భవన నిర్మాణ నమూనాను కూడా ఖరారు చేసింది. ఇందుకు అనుగుణంగా… శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అయితే ఈ కొత్త ఆస్పత్రి ఎలా ఉంటుంది..? ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి…
కొత్త ఉస్మానియా ఆస్పత్రి - ముఖ్యమైన అంశాలు:
- నిజాం హయాంలో ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాల మేరకు 1919లో ఈ ఆసుపత్రి భవనం పూర్తయింది .
- గత బీఆర్ఎస్ హయాంలో ఈ భవనాన్ని కూల్చివేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే పలు కోర్టు కేసుల నేపథ్యంలో సర్కార్ వెనక్కి తగ్గింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్…. కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు గోషామహాల్ ను ఖరారు చేసింది.
- నూతన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 31, 2025వ తేదీన శంకుస్థాపన చేశారు.
- మొత్తం 26.30 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ఆస్పత్రి నిర్మాణం ఉండనుంది. 2 వేల పడకల సామరథ్యంలో 32 లక్షల చదరపు అడుగుల భవనాలు ఉంటాయి.
- 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది. 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఏర్పాటు చేస్తారు.
- అధునాతన వసతులతో 41 ఆపరేషన్ థియేటర్లు నెలకొల్పుతారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన అవయవమార్పిడి శస్త్ర చికిత్సల విభాగం ఉంటుందగి.
- డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలు అనుబంధంగా ఉంటాయి. 750 సీట్ల కెపాసిటీతో భారీ ఆడిటోరియం నిర్మిస్తారు.
- విద్యార్థులు, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్ జోన్, ప్లే జోన్ ఉంటుంది. పేషెంట్ అటెండర్లకు నిత్యన్నదానం కోసం ధర్మశాలను కూడా నిర్మాణం చేయనున్నారు.
- రెండు వేల కార్లు, వెయ్యి బైక్‌లకు సరిపడా అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. నలువైపులా విశాలమైన రోడ్లు, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ప్రభుత్వం మోడల్ ను ఖరారు చేసింది.
- ఈ కొత్త ఉస్మానియా భవన నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
సంబంధిత కథనం