Hyderabad tragedy: తండ్రి చేసిన అప్పులు తీర్చాలని కుమార్తెకు కానిస్టేబుల్ టార్చర్, భరించలేక యువతి ఆత్మహత్య
Hyderabad tragedy: ఓ తండ్రి చేసిన అప్పుల్ని తీర్చాలంటూ అతని కుమార్తెను పోలీస్ కానిస్టేబుల్ అతని భార్య తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. పోలీస్ కేసులో ఇరికించడంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad tragedy: ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి కానిస్టేబుల్ నుంచి డబ్బులు తీసుకుని ముఖం చాటేశాడు. ఆ తర్వాత పదవీ విరమణ చేసేశాడు. రిటైర్ అయ్యాక అచూకీ లేకుండా పోవడంతో డబ్బులిచ్చిన వారు ఆమె కుమార్తెపై ఒత్తిడి చేశారు. కానిస్టేబుల్‌గా పనిచేసే వ్యక్తి డబ్బు కోసం ఈ వ్యవహారంతో సంబంధం లేని యువతిపై పోలీస్ కేసు పెట్టించాడు. మనస్తాపానికి గురైన యువతి ప్రాణాలు బలి తీసుకుంది.
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగి యువతి ఆత్మహత్య అందరిని కలిచి వేసింది. కుటుంబాన్ని వదిలేసిన ఓ వ్యక్తి చేసిన పనికి సంబంధం లేని యువతి ప్రాణాలు కోల్పోయింది. నాచారంలోని బాపూజీనగర్ సరస్వతీకాలనీలో నివాసం ఉండే పులివర్తి దీప్తి(28) హబ్సిగూడలోనిఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పని చేస్తోంది.
దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పనిచేసి కొంత కాలం క్రితం పదవీ విరమణ చేశారు. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ పనిచేసే బెల్లా అనిల్‌తో పరిచయం ఉంది.ఈ క్రమంలో సంగీతరావు.. అనిల్ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం రూ.15 లక్షలు వసూలు చేశాడు.
ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఆమెకు ఉద్యోగం ఇప్పించ లేదు. అడుగుతుంటే ఇదిగో అదిగో అంటూ మాటలు చెబుతూ వచ్చాడు. కొద్ది రోజుల క్రితం సంగీతరావు పదవీ విరమణ చేశాడు. రిటైర్ అయ్యాక డబ్బులిస్తానని చెప్పినా ఆ తర్వాత మాయం అయిపోయాడు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని సంగీతరావు కుమార్తె దీప్తిని అడిగేవాడు.
డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, తమతో ఆయన చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని, విడిగా ఉంటున్నాడని సమాధానం చెప్పింది. ఆ సంగతి అనిల్ పట్టించుకోకుండా తన భార్య అనితతో నాచారం పీఎస్‌లో ఫిర్యాదు చేయించాడు. తండ్రి, కుమార్తెలు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో దీప్తి, సంగీతరావులపై ఛీటింగ్ కేసు నమోదైంది.
డబ్బు కోసం అనిల్, అనిత న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు. ఈ క్రమంలో ఆఫీసులో అందరికి విషయం తెలియడంతో మనస్తాపానికి గురైన దీప్తి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. అర్థరాత్రి తల్లి వచ్చి చూసేసరికి అప్పటికే మరణించింది. ఆమె ఫోన్‌లో సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఉంది. బాధితురాలి వాంగ్మూలంతో నాచారం పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులు అనే వారిపై కేసు నమోదు చేశారు.
దీప్తి మరణానికి ముందు రికార్డు చేసిన వీడియోలో "నా చావుకు అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణమని ఆరోపించింది. వారి దగ్గర నాన్న డబ్బు తీసుకుంటే తన మీద నకిలీ కేసు నమోదు చేయించి జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. ఈ కేసుల మీద పోరాడే ఆర్థిక స్తోమత తనకు లేదని, నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు కారణమైన వాళ్లకు శిక్షపడాలని, మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయాలని కన్నీరు పెట్టుకుంది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.