Sangareddy Crime: మాజీ ఐపీస్ అధికారికే కుచ్చుటోపీ .. ఫోర్జరీ డాక్యుమెంట్ లతో భూమి విక్రయించేందుకు యత్నం-conspiracy to sell land of ips officer with forged documents ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Crime: మాజీ ఐపీస్ అధికారికే కుచ్చుటోపీ .. ఫోర్జరీ డాక్యుమెంట్ లతో భూమి విక్రయించేందుకు యత్నం

Sangareddy Crime: మాజీ ఐపీస్ అధికారికే కుచ్చుటోపీ .. ఫోర్జరీ డాక్యుమెంట్ లతో భూమి విక్రయించేందుకు యత్నం

HT Telugu Desk HT Telugu
Jul 11, 2024 01:49 PM IST

Sangareddy Crime: భూ అక్రమాలకు అంతులేకుండా పోయింది. పట్టణ శివారులలో విలువైన భూములు కనిపిస్తే చాలు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.తాజాగా ఓ రిటర్డ్ మాజీ ఐపీస్ అధికారి భూమిపై దళారుల కన్ను పడింది.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భూమికి నకిలీపత్రాలు సృష్టించిన నిందితులు
రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భూమికి నకిలీపత్రాలు సృష్టించిన నిందితులు

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో భూ అక్రమాలకు అంతులేకుండా పోయింది. పట్టణ శివారులలో విలువైన భూములు కనిపిస్తే చాలు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.తాజాగా ఓ రిటర్డ్ మాజీ ఐపీస్ అధికారి భూమిపై దళారుల కన్ను పడింది. దీంతో నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి రిటర్డ్ మాజీ ఐపీస్ అధికారి,అతని కుటుంబసభ్యులకు చెందిన 57 ఎకరాల భూమిని విక్రయించేందుకు యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది.

జోగిపేట సిఐ అనిల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా అందోల్ కి చెందిన మాజీ ఐపీస్ అధికారి,సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ప్రభాకర్ రెడ్డి,ఆయన కుటుంబానికి చెందిన నర్సింహా రెడ్డి,బాలకృష్ణ రెడ్డి,అంజమ్మ అనే నలుగురికి జోగిపేట ఏటీగడ్డ శివారులో 57 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అయితే వీరు నలుగురు కలిసి భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారు ఆ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు,ఆధార్ కార్డుల జీరాక్స్ లను కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు పంపారు.

ఫోర్జరీ నకిలీ డాక్యుమెంట్ లను సృష్టించి ....

నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన ల్యాండ్ బ్రోకర్ సంజీవరెడ్డి, కంగ్టి మండలంలోని దెగుల్ వాడికి చెందిన సుధాకర్, ముకుందనగర్ తండాకు చెందిన రవీందర్ లకు కూడా అందాయి. దీంతో ఆ భూమిని దొంగతనంగా అమ్మేయాలని సంజీవరెడ్డి కి దుర్బుద్ధి పుట్టింది. ఈ విషయాన్నీ రవీందర్,సుధాకర్ లకు చెప్పాడు. దీంతో శేరి ప్రభాకర్ రెడ్డి,వారి కుటుంబసభ్యులు కలిసి ఆ 57 ఎకరాల భూమిని ఎకరాకు రూ. 39 లక్షల చొప్పున సంజీవరెడ్డికి అమ్మినట్లుగా చేసినట్లుగా ముగ్గురు కలిసి జీరాక్స్ ల ఆధారంగా వారి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్ లను సృష్టించారు.

ఈ క్రమంలో మరల అదే భూమిని హైదరాబాద్ కు చెందిన బిల్డర్ యాదగిరి రెడ్డికి ఒక ఎకరం రూ. 40 లక్షల చొప్పున రూ. 22 . 23 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బిల్డర్ వద్ద నుండి సంజీవరెడ్డి టోకెన్ అమౌంట్ గా 11 లక్షల చెక్కును తీసుకున్నారు. అనంతరం నెల రోజులకు యాదగిరి రెడ్డి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంజీవరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అనుమానం వచ్చిన యాదగిరిరెడ్డి ఈ నెల 4 న అందోల్ లోని వ్యవసాయ భూమి వద్దకు వచ్చి పరిశీలిస్తున్నారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న భూయజమాని శేరి నర్సింహారెడ్డి మీరెవరని వారిని ప్రశ్నించాడు. అప్పుడు యాదగిరి రెడ్డి మేము ఈ భూమిని కొన్నామని డాక్యుమెంట్ లు చూపించాడు. దీంతో ఆశ్చర్యపోయిన నర్సింహారెడ్డి మేము ఆ భూమిని ఎవరికి అమ్మలేదని చెప్పడంతో యాదగిరిరెడ్డి కంగుతిన్నాడు. అతని వద్ద ఉన్న డాక్యుమెంట్ కాపీలను చూపించగా అవి నకిలీవని తేలాయి.

దీంతో ప్రభాకర్ రెడ్డి సంగారెడ్డి ఎస్పీ రూపేష్ కు పిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు జోగిపేట పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు సంజీవరెడ్డి, రవీందర్, సుధాకర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు చాచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ శివ,సురేష్ లను సీఐ అభినందించారు.

WhatsApp channel