Narayankhed Municipality: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీని దక్కించుకున్న కాంగ్రెస్
Narayankhed Municipality: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పురపాలక సంఘాలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ వశం అవుతున్నాయి. తాజాగా నారాయణ్‌ఖేడ్ కూడా ఆ జాబితాలో చేరింది.
Narayankhed Municipality: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలు కాంగ్రెస్ పరం అవుతున్నాయి. పురపాలక సంఘాల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి పెట్టి, ఆపై తమ బలం నిరూపించుకుని కాంగ్రెస్ పార్టీ సొంత పాలకవర్గాలను ఏర్పాటు చేస్తోంది.
ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. బుధవారం నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఆనంద్ స్వరూప్ షెట్కార్ , వైస్ చైర్మన్ గా దారం శంకర్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన డిప్యూటీ కలెక్టరు వసంత కుమారి ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ చెందిన సంజీవరెడ్డి గెలవడంతో నారాయణఖేడ్ లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
పార్టీ మారిన ముగ్గురు కౌన్సిలర్లు…
నారాయణ ఖేడ్ పురపాలక సంఘంలో ఉన్న మొత్తం 15 మంది కౌన్సిలర్లలో, బిఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీ కి మద్దతు ఇస్తున్న కౌన్సిలర్ల సంఖ్య 11కు చేరింది.
కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వగా, ఫిబ్రవరి 2న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి భారాసకు చెందిన ఛైర్పర్సన్ రుబీనా బేగం, వైస్ చైర్మన్ పరశురాం పదవులు కోల్పోయారు.
బుధవారం ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశానికి ఎనిమిదిమంది కాంగ్రెస్, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన బిఆర్‌ఎస్‌కు సంబంధించిన ముగ్గురు కౌన్సిలర్లు, ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిపి మొత్తం 12 మంది హాజరయ్యారు.
చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి ఒక్కో దరఖాస్తు రావడంతో, వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. దీంతో పురపాలిక బిఆర్‌ఎస్ చెయ్యిజారి హస్తగతమైంది.
ఎంపీపీ ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తు…
ఆందోల్ నియోజకవర్గం రాయికోడు మండల ఎంపీపీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి . ఎంపీపీ గా ఉన్న వెంకట్రావు మృతి చెందడంతో ఈరోజు కొత్త ఎంపీపీ కోసం ఎన్నిక జరిగింది .
ఎంపీపీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఇటిక్యాపల్లి ఎంపీటీసీ పండరిని మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు.
ఎంపీపీగా ఇస్తామంటూ ఆశ చూపి పండరి అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోగా ఈరోజు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపిటిసి లంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థి ఎంపీటీసీ మొగులప్పను ఎంపీపీగా ప్రతిపాదించి కాంగ్రెస్ పార్టీకి జలక్ ఇచ్చారు .
అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయించుకోవాలని బీఆర్ఎస్ ను చీల్చాలని అధికార పార్టీ చేసిన కుట్రలను బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు భగ్నం చేశారు. తమ పార్టీతో గెలిచి తమకే ద్రోహం చేసిన పండరిని ఎంపీపీగా చేసే ప్రసక్తే లేదంటూ రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే కాంతి కిరణ్ మండల నాయకుల బస్వరాజ్, సిద్దన్న , విట్టల్ లతో సమాలోచనలు చేశారు.
బీఆర్ఎస్ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయికోడ్ గ్రామ ఎంపీటీసీ మొగులప్పను నిలబెట్టి ఎంపీపీగా ఎన్నుకున్నారు . ఈ పరిణామం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.