Karimnagar Politics: మానకొండూర్ నియోజకవర్గంలో అధికార విపక్ష పార్టీలు కాంగ్రెస్- బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అవినీతికి పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించడంతో, ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆరు మండలాల నుంచి బెజ్జంకి కి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని రసమయి రావాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్- బీఆర్‌ఎస్ హంగామాతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. కొందరు రసమయి ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరోవైపు బిఆర్ఎస్ శ్రేణులు పరస్పర ఆరోపణలు విమర్శలతో ఆందోళన దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ ఇరుపార్టీల నాయకులను కార్యకర్తలను అరెస్టు చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా కాలువ నీళ్ళను గుండారంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ కు రసమయి తరలించుకుపోయాడని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రసమయి తీరుపై ఆరు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పై చేసిన ఆరోపణలు నిరూపించకుంటే తరిమికొట్టక తప్పదని హెచ్చరించారు. బహిరంగ చర్చకు రాకుంటే ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామన్నారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి తోపాటు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ వైఖరిని ఎండ గట్టేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. బెజ్జంకి మండలం గుండారంలోని ఫామ్ హౌస్ లో ఉన్న రసమయిని గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ తీరు, ఎమ్మెల్యే వైఖరిపై రసమయి బాలకిషన్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను చేసిన ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని విచారణ జరిపిస్తే అన్ని బయటపడుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి 6 మండలాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు తన ఫామ్ హౌస్ పై దాడి చేసి తనను చంపేందుకు ఉసిగొలిపాడని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
గత కొద్దిరోజులుగా మానకొండూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మద్యం మాటల యుద్ధం కొనసాగుతుంది. చివరకు బహిరంగ చర్చకు సవాళ్ళ పర్వం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పార్టీల శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు తాత్కాలికంగా ఆందోళనకు కట్టడి చేశారు. ఇరు పార్టీలు తగ్గేదేలేదంటు ఎంతటికైనా తెగించడంతో రాజకీయ పోరాటం ఎటువైపు దారి తీస్తుందోనని సర్వత్రా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం