సీఎం కుర్చీ ఎవరిది? రేవంత్‌కు పగ్గాలు దక్కుతాయా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖరారైంది. ఇక ఆ పార్టీ నుంచి సీఎం కుర్చీ ఎవరికి దక్కనుంది? అధిష్టానం రేవంత్‌కే మొగ్గుచూపుతుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాల ప్రకారం 65 సీట్లలో కాంగ్రెస్ కూటమి ఆధిక్యత కనబరుస్తోంది. ఇప్పుడు ఇక అందరి మదిలో మెదిలే ప్రశ్న సీఎం కుర్చీ ఎవరికి దక్కనుందనేదే.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అవుతుంది. దానికి ఏఐసీసీ నుంచి పరిశీలకులు కూడా వస్తారు. లెజిస్లేచర్ పార్టీలో ఎమ్మెల్యేలంతా తమ అభిప్రాయాన్ని పరిశీలకుడికి వివరిస్తారు. దానిని అధిష్టానానికి చేరవేస్తారు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వదిలేస్తారు. అయితే ఏకాభిప్రాయం లేనప్పుడు గ్రూపులుగా విడిపోయి తమ బలాన్ని ప్రదర్శించేందుకు నాయకులు ప్రయత్నిస్తారు. సీనియర్ నేతలు జానారెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి అనూహ్యంగా జగిత్యాలలో వెనకంజలో ఉన్నారు.
ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయానికి పీసీసీ అధ్యక్షుడిగా ఎ.రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. ఇద్దరూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పాదయాత్రలు, బస్సుయాత్రలు చేశారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి విపరీతమైన క్రేజ్ సంపాదించారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలోనూ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలిచేందుకు దోహదపడ్డారు. రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్‌ను కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా చూశారు.
అయితే కేవలం క్రేజ్ ఒక్కటే కాదు.. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థులుగా ఉన్న నేతల రాజకీయ అనుభవాన్ని, పాలనా అనుభవాన్ని కూడా చూస్తుంది. పైగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంది. అలాగే పార్టీ మెజారిటీ మార్క్ దాటగలిగింది కానీ పెద్దగా మెజారిటీ తెచ్చుకోలేకపోయింది. ఒకవేళ ముఖ్యమంత్రిపై శాసన సభ్యుల్లో అసమ్మతి ఉన్నా, లేక ఇతర పార్టీలు ఈ అభ్యర్థులను తమవైపు లాక్కునే ప్రయత్నాలు చేసిన వాటిని తిప్పికొట్టాల్సిన బలమైన నేత కావాలి. ఇన్ని సామర్థ్యాలు కలిగిన నేతకే సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి గానీ, సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు గానీ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు. మల్లు భట్టి విక్రమార్క మాత్రం ఉమ్మడి శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఇద్దరికీ 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ పాలనాపరమైన అనుభవం లేదు. అయితే అనుభవం లేకపోయినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవి దక్కదనే వాదనలోనూ పస ఉండకపోవచ్చు.
రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డికి ఉన్న ప్రతికూల అంశం అసమ్మతి. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొద్ది కాలానికే పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ లోని సీనియర్ల నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదురైంది. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్ నేతలకు రేవంత్‌కు ఆ కాలంలో అంత సఖ్యత లేదు. రేవంత్ చాలా పార్టీలు మారాడని, బ్లాక్‌మెయిలరని, కేసులు ఉన్నాయని వంటి అనేక ఫిర్యాదులు కాంగ్రెస్ అధిష్ఠానానికి చేరినా అవి పెద్దగా పనిచేయలేదు. రేవంత్‌కు ఉన్న పాపులారిటీ, వాక్చాతుర్యం ఆయనకు పీసీసీ పదవి దక్కేలా చేసింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి దక్కేందుకు ఇవే సోపానాలు అయ్యే అవకాశం ఉంది.
అలాగే ఆయనతో టీడీపీ నుంచి వచ్చిన వారిలో కొందరికి టికెట్లు దక్కకపోయినా టికెట్లు దక్కిన వారిలో చాలా మంది గెలిచారు. ఆయన బలపరీక్షకు ఈ అంశం ఉపయోగపడుతుంది. అలాగే బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఉపయోగపడుతుంది. అయితే రేవంత్ రెడ్డి పాపులారిటీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పడం కష్టం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు సీట్లు రాకపోవడం, ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా కనిపించడం చూస్తుంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే కాంగ్రెస్‌కు విజయం దక్కేలా చేసిందని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంఘటితం చేయడంలో రేవంత్ నాయకత్వం ఉపయోగపడిందని చెప్పొచ్చు. రేవంత్ తన దూకుడు స్వభావాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కార్యకర్తలను, నేతలను నెట్టడం, తొక్కడం, కొట్టడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో ఆయనకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. ప్రజలతో ఆత్మీయంగా వ్యవహరించడంలో ఆయన విఫలమవుతున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు.
ఏది ఏమైనా సీఎం పదవికి ఎంతో మంది ఆశావహులు, పోటీదారులు ఉన్నప్పటికీ సీఎల్పీ రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేయడం సజావుగానే జరుగుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కనీసం పార్లమెంటు ఎన్నికల వరకు కాంగ్రెస్ సీనియర్లలో అసమ్మతి కనిపించదన్న గ్యారంటీ ఉంటుంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం సీట్లకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులను ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. దీనికి రేవంత్ రెడ్డి చొరవచూపుతారన్న నమ్మకం పార్టీలో ఉంది. అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో బీఆర్ఎస్ చేసిన తరహాలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు రేవంత్ రెడ్డి సాహసం చేయగలరని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. అందువల్ల రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మల్లు భట్టివిక్రమార్క
మల్లు భట్టివిక్రమార్కకు జనంలో అంతగా పాపులారిటీ లేకపోవడం ప్రతికూల అంశం. ఇదివరకటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఏదైనా మంత్రిత్వ శాఖ దక్కి ఉంటే ఆ అనుభవం ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు దక్కించుకోవడంలో ఉపయోగపడేది. అయినప్పటికీ కాంగ్రెస్ విదేయుడిగా ఉండడం, షెడ్యూలు కులాలకు చెందిన వ్యక్తి కావడం ఆయనకు ఈ పదవి దక్కేందుకు దోహదపడుతాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఒకవేళ షెడ్యూలు కులాలకు పెద్ద పీట వేయాలనుకుంటే భట్టికి అవకాశం రావడం తథ్యం.
దామోదర రాజనర్సింహ
ఆందోల్ నుంచి గెలిచిన దామోదర రాజనర్సింహకు ఇదివరకు మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం సీఎం కుర్చీ ఎక్కేందుకు ఉపయోగపడుతుంది. పైగా తెలంగాణలో షెడ్యూలు కులాల్లో మెజారిటీ సంఖ్యలో ఉన్న మాదిగ ఉపకులానికి చెందిన వారు కావడంతో అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దామోదర రాజనర్సింహ దూకుడుగా ఉంటారని, ప్రజలతో ఆత్మీయంగా ఉండరన్న విమర్శను ఎదుర్కొంటున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డికి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, అలాగే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సౌమ్యుడిగా, అధిష్ఠానానికి విధేయుడిగా పేరుంది. అయితే రేవంత్ రెడ్డితో పోల్చితే అంత పాపులారిటీ లేదు. అవినీతి మరకలు లేవు. కానీ కేసీఆర్‌కు కావాల్సిన వ్యక్తిగా ప్రజల్లో ఉన్న ప్రచారం ఉత్తమ్‌కు ప్రతికూలంగా మారుతుంది. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్‌పై పెద్దగా పోరాడలేదన్న అపవాదు ఉంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు పర్యాయాల్లోనూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కోసం తన మంత్రిపదవికి రాజీనామా కూడా చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవికి తాను లాబీయింగ్ చేయనని ప్రకటించినప్పటికీ.. రేసులో లేనని మాత్రం చెప్పలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసే వ్యాఖ్యలు తరచుగా వివాదాస్పదమవుతుంటాయి. ముఖ్యంగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీతో వెంకటరెడ్డి అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఆయన చేసే వ్యాఖ్యలే ఆయనకు ప్రతికూలంగా మారుతుంటాయన్న ప్రచారం ఉంది.
సీతక్క (ధనసరి అనసూయ)
షెడ్యూలు తెగల కోటా నుంచి ధనసరి అనసూయకు ఛాన్స్ దక్కుతుందన్న వాదన ఉంది. 2009లో, 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ఇప్పుడు మరోసారి విజయం సాధించింది. అయితే 2009లో టీడీపీ తరపున, 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన ప్రతిపక్షంలోనే ఉన్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ సామాజిక న్యాయ సమీకరణల్లో భాగంగా ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యం లేదు.
దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు కుమారుడు శ్రీధర్ బాబుకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం వెనక శ్రీధర్ బాబు కృషి కూడా ఉందని కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసించింది. ఇవన్నీ ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీ పెట్టేందుకు ఉపయోగపడేవే. కానీ శ్రీధర్ బాబు సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం. తెలంగాణలో మెజారిటీ జనాభా ఉన్న సామాజిక వర్గాలకు సీఎం పదవిని దక్కేలా అధిష్ఠానం నిర్ణయిస్తే శ్రీధర్ బాబుకు నిరాశే మిగులుతుంది.
పొన్నం ప్రభాకర్
ఒకసారి కరీంనగర్ ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఈసారి హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ముందంజలో ఉన్నారు. తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన నేతగా, అధిష్ఠానానికి విధేయుడిగా మంచి పేరుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా కాంగ్రెస్‌లో మంచి పేరుంది. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే పొన్నం ప్రభాకర్ రేసులో ఉంటారు.