Telangana Congress : మొన్నే నామినేటెడ్ పదవి... అప్పుడే రాజీనామా..! హాట్ టాపిక్ గా సీనియర్ నేత ప్రకటన
Telangana Congress Latest News : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే నామినేటెడ్ పదవి దక్కించుకున్న సీనియర్ నేత మల్లు రవి ఆ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పటం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
Mallu Ravi Resign: తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు దక్కించకోవటమే లక్ష్యంగా పలువురు సీనియర్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న సదరు నేతలు… ఎవరికి వారుగా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే… ఇటీవలే ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి దక్కించుకున్న ఓ సీనియర్ నేత రాజీనాామా చేయటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
రాజీనాామా చేశా - మల్లు రవి
ఢిల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా(Resigned) చేసినట్లు ప్రకటించారు మల్లు రవి. శుక్రవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని కల్వకుర్తిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లు రవి….. న్యూఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశానని తెలిపారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
మల్లు రవి రాజీనామా అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత… నలుగురిని సలహాదారులుగా నియమించింది. ఇందులో మల్లు రవి ఒకరిగా ఉన్నారు. గత జనవరి 28న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సోదరుడు అవుతారు.
రేసులో పలువురు నేతలు…
నాగర్‌కర్నూల్ ఎస్సీ రిజర్వ్‌డ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తూ దాదాపు 26మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో మల్లు రవి మాత్రమే కాకుండా పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మందా జగన్నాథం ఈ టికెట్ ఆశిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంపత్ కుమార్ కూడా పార్లమెంట్ బరిలో ఉండేందుకు సిద్ధమయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరున్న చారకొండ వెంకటేశ్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. మల్లు రవికి నామినేటెడ్ పదవి దక్కటంతో… ఆయన పోటీలో ఉండకపోవచ్చని అంతా భావించారు. కానీ అనూహ్యంగా తన పదవికి రాజీనామా ఇచ్చానని చెప్పటంతో…. నాగర్ కర్నూలు కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న క్రమంలో….. మల్లు రవి ప్రకటన ఉత్కంఠను రేపింది.
సీనియర్ నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో… ఈ సీటును హైకమాండ్ ఎవరికి కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పదవికి రాజీనామా చేసిన రవికే కట్టబెడుతుందా లేక ఇతర నేతలకు కేటాయిస్తుందా అనేది చూడాలి….!