Telangana Assembly : 'ఈ సభ మీ సొంతం కాదు' - ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై సభలో దుమారం..!
తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ ను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలను… కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సభ ప్రారంభమైన రెండో రోజే… అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ తరపున జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావిస్తూ… ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలోనే… అధికారపక్షం వైపు నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు.
జగదీశ్ రెడ్డి మాట్లాడే సమయంలో స్పీకర్ కల్పించుకొని…. సభా సంప్రదాయలకు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు. అయితే ఇందుకు స్పందించిన జగదీశ్ రెడ్డి… స్పీకర్ ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి సభా సంప్రదాయాలను ఉల్లఘించానో చెప్పాలని కోరారు. అంతేకాదు… ఈ సభలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. మా అందరీ తరపున పెద్ద మనిషిగా మీరు స్పీకర్ గా కూర్చీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ సభ మీ సొంతం కూడా కాదు అంటూ మాట్లాడారు.
జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం…
జగదీశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారని స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా ఆక్షేపించారు. మరోవైపు శాసనభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో స్పందించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అహంకారంతో మాట్లాడకుండా… క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు.
మరోవైపు బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ… జగదీశ్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. సభలో ప్రతి సభ్యుడికి హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. సభలో గందరదోళం నెలకొనటంతో… స్పీకర్ వాయిదా వేశారు.
స్పీకర్‌ను అవమానించలేదు - హరీశ్ రావు
అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు… జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. “జగదీష్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. సభ అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్‌పార్లమెంటరీ పదం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు. కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడింది. స్పీకర్‌ను కలిసి సభా రికార్డులు తీయాలని కోరడం జరిగింది. స్పీకర్ గారిని అగౌవరపరిచే విధంగా జగదీష్ రెడ్డి గారు మాట్లాడలేదు” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
మరోవైపు అసెంబ్లీ వ్యవహారాలను మంత్రి శ్రీధర్ బాబు… ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలకు తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపినట్లు సమాచారం. జగదీశ్ రెడ్డి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది…!
సంబంధిత కథనం