TG congress MLA House : వెండి మంచం, వెండి కుర్చీలు.. ఈ ఎమ్మెల్యే ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతారు!
TG congress MLA House : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా మారారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి 10 మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారని.. రెండోది ఆయన ఇంటికి సంబంధించిన అంశం. అవును.. ఇప్పుడు ఆయన ఇంటి వీడియో వైరల్ అవుతోంది.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యంగా ఆయన ఇంటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిరుధ్ రెడ్డి బెడ్ రూంలో వెండి మంచం, వెండి కుర్చీలు, అన్ని వెండి వస్తువులే ఉన్నాయి. దీంతో అనిరుధ్ రెడ్డి ఇల్లు రాజభవనంలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతా వెండిమయం..
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విలాసవంతమైన ఇల్లు.. తెలంగాణ ప్రజలనే.. కాదు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. వెండి ఫర్నిచర్‌తో అలంకరించిన బెడ్ రూం, మంచాలు, బెడ్ సైడ్ టేబుల్స్ నుండి డ్రెస్సింగ్ టేబుల్స్, కాఫీ టేబుల్స్ వరకు వెండితో తయారు చేయించారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇటీవల అనిరుధ్ రెడ్డి ఇంటి హోమ్ టూర్ వీడియోను షేర్ చేసింది.
యూనిక్‌గా ఉండాలని..
ఈ వీడియోలో అనిరుధ్ రెడ్డి.. తన గదిని ప్రత్యేకంగా ఉంచుకోవడానికి వెండి ఫర్నిచర్ కస్టమ్-మేడ్ చేశానని వివరించారు. "ఇదంతా వెండి ఫర్నిచర్. నేను నా గదిని ఇలాగే ఉంచుకోవాలని అనుకున్నాను. నా గది ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నాను" అని యాంకర్‌ను తన బెడ్ రూంలోకి స్వాగతిస్తూ చెప్పారు. యాంకర్ కూడా అశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఎమ్మెల్యేల సమావేశంపై క్లారిటీ..
హైదరాబాద్ హోటల్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. "నేను వ్యక్తిత్వం ఉన్న ఎమ్మెల్యేని. నా కుటుంబానికి మంచి పేరు ఉంది. మేము బ్రోకరేజ్‌లో పాల్గొనము. నేను ఏదైనా ఫైల్ అడిగానని రెవెన్యూ మంత్రి చెబితే.. దానిని బయటపెట్టాలి. ఇలా వ్యక్తిత్వ హననం చేయడం ఆమోదయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించారు.
విందు సమావేశం మాత్రమే..
"మా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి మేము కోహినూర్ హోటల్‌లో సమావేశమయ్యాం. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలు చేతులుకట్టుకొని నిల్చునేవారు. కానీ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అంతా ఐక్యంగా ఉంటాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో మేము కొన్ని హామీలు ఇచ్చాం. వాటికి నిధులు కావాలని అడగాలనుకున్నం. పది మంది ఎమ్మెల్యేలు కలిస్తే, ఏదో తప్పు జరిగిందని ప్రచారం చేస్తున్నారు. అది కేవలం విందు సమావేశం మాత్రమే" అని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.