Patancheru Congress : పటాన్‌చెరు కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు - ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం-congress leaders and cadre staged a massive protest patancheru ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Patancheru Congress : పటాన్‌చెరు కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు - ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం

Patancheru Congress : పటాన్‌చెరు కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు - ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం

HT Telugu Desk HT Telugu
Jan 23, 2025 08:52 PM IST

పటాన్‌చెరు కాంగ్రెస్‌ లో మరోసారి విబేధాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని మరో వర్గం ధర్నాకు దిగింది. అంతేకాదు.. ఓ దశలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించింది. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా
కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలో ఆందోళన చేపట్టారు. ఇటీవల బొల్లారం మున్సిపాలిటీలో జరిగిన సంఘటనను నిరసిస్తూ… నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల మహిపాల్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన చేపట్టారు.

yearly horoscope entry point

ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ పటాన్ చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ‘ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్ - సేవ్ కాంగ్రెస్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదు…

పార్టీ కార్యకర్తలనుఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. అన్నింటిలో బీఆర్ఎస్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

క్యాంప్ ఆఫీస్ పై దాడి….

కార్యాలయంలో దూసుకెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పలువురు కార్యకర్తలు లోపలికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో గులాబీ రంగులో ఉన్న కుర్చీలను ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాపతినిధులు, నాయకులను ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం సైతం ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కార్యక్రమాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

ఇటీవల బొల్లారం మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పనులు పూర్తికాకముందే హడావిడి చేసి ప్రారంభోత్సవాలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ పార్టీ అసలైన నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి:

ఈ సంఘటనపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పందించారు. పార్టీ ఇంఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కావాలని కొంతమంది కార్యకర్తలను తనపైకి ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తన కార్యాలయంపైన దాడి చేసినవారికి సరైన రీతిలో గుణపాఠం చెబుతామన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం