Jagga Reddy : ట్రోల్ చేసేవాళ్లు దొరికితే బట్టలూడదీసి కొడతా : జగ్గారెడ్డి
Jagga Reddy : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ట్రోల్ చేసేవాళ్లు దొరికితే బట్టలూడదీసి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. తాను కలెక్టర్‌ను తిట్టినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీశ్ రావుకు మతి భ్రమించిందని విమర్శలు గుప్పించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గా రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను కలెక్టర్‌ను దూషించినట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. తనను ట్రోల్ చేసేవాళ్లు దొరికితే బట్టలూడదీసి కొడతానని జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
'కేటీఆర్, హరీష్‌కు మతిభ్రమించింది. అధికారం లేక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం బ్యాచ్‌లా మారింది. నాపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లను వదిలిపెట్టను. కలెక్టర్‌ను తిట్టినట్టు వీడియో క్రియేట్ చేశారు. ట్రోల్ చేసేవాళ్లు దొరికితే బట్టలూడదీసి కొడతా' అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు.
మహిళా కలెక్టర్ మీద సంచలన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారని వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. 'నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఆఫీసుకు రావడం లేదు, ఇంట్లో ఏం చేస్తుంది. --- పడుకుందా అని పీఏకు ఫోన్ చేసి తిట్టినా. నాకు కోపం వస్తే ఇలాంటి మాటలే వస్తాయి' అని జగ్గారెడ్డి మాట్లాడినట్టు వీడియో వైరల్ అవుతోంది. ఆయన హిందీలో మాట్లాడినట్టు ఆ వీడియోలో ఉంది. దీనిపైనే ప్రస్తుతం వివాదం జరుగుతోంది.
అటు జీవన్ రెడ్డి వ్యవహారంపైనా జగ్గారెడ్డి స్పందించారు 'జీవన్‌రెడ్డి ఆవేదన చూసి బాధ కలిగింది. ఏం జరుగుతుందో నాకు అర్థంకావడం లేదు. జీవన్‌రెడ్డికి అండగా నేను ఉంటా. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ వాది. ఆయన జీవితమంతా కష్టాలే. జీవన్‌రెడ్డి ఎప్పుడూ జనాల్లో ఉంటారు. జగిత్యాల ప్రజలు ఎందుకు ఓడించారో తెలియదు. సంగారెడ్డిలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన నన్ను.. ప్రజలు ఎందుకు ఓడించారో అర్థంకావడం లేదు' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.