కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత-congress leader d srinivas passed away ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 29, 2024 07:13 AM IST

Congress Leader D.Srinivas Passed Away : కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యలు తెలిపారు

డి.శ్రీనివాస్ కన్నుమూత
డి.శ్రీనివాస్ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా డీ. శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.  గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

డి.శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరి…. రాజ్యసభ ఎంపీగా పని చేశారు.  హైదరాబాద్ నివాసంలో డీఎస్ పార్థీవదేహనికి పలువురు నేతలు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.  రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.

కాంగ్రెస్ లో సీనియర్ నేతగా గుర్తింపు….

ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరైన ధర్మపురి అర్వింద్.. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా(బీజేపీ) ఉన్నారు. పెద్ద కుమారుడు డి.సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్ గా పని చేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 

డి.శ్రీనివాస్ 1989, 1999, 2004లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది. కొంతకాలం బీఆర్ఎస్ లో కొనసాగిన డీఎస్… ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. చివర్లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మరోవైపు అనారోగ్య సమస్యలతో డీఎస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

ఎంపీ అర్వింద్ ప్రకటన….

తండ్రి మృతిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓ ప్రకటన చేశారు. “అన్నా..అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY ! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు,భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు,ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఎప్పటికీ నా లోనే ఉంటావు” అంటూ పోస్ట్ చేశారు.

Whats_app_banner