చాలా రోజులుగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై కసరత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కేబినెట్ విస్తరణకు ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈ ఆదివారమే(జూన్ 08) మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశముంది. ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ముగ్గురు లేదా నలుగురికి చోటు దక్కే అవకాశం ఉంది. సామాజికవర్గాల ఆధారంగా ఈ బెర్తులను కేటాయించనున్నారు. ఆ దిశగా పార్టీ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఇవాళ సాయంత్రం రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా… వీటి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. దీంతో కేబినెట్ లో ఎవరికి చోటు దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత కేబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది.ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరూ లేరు. ఇక్కడ్నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.