TG Govt Jobs : ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..? పూర్తి లెక్కలు ఇవే!-congress government in telangana filled 53 thousand jobs in a single year ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Jobs : ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..? పూర్తి లెక్కలు ఇవే!

TG Govt Jobs : ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..? పూర్తి లెక్కలు ఇవే!

Basani Shiva Kumar HT Telugu
Nov 23, 2024 01:27 PM IST

TG Govt Jobs : తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది కావొస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. అసలు ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కేవలం ఒకేఒక్క ఏడాదిలో 53 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ క్యాలండర్‌ ప్రకటించి నియామకాలు చేపట్టినట్టు స్పష్టం చేసింది. యూపీఎస్సీ తరహాలోనే టీజీపీఎస్సీ పని చేస్తోందని.. ఆ విధంగా ప్రక్షాళన చేశామని ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా ఇంకా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామక పరీక్షలు, ఫలితాల వెల్లడికి ఉన్న అడ్డంకుల్ని తొలగించామని స్పష్టం చేసింది.

తెలంగాణలో రేవంత్ సర్కారు కేవలం 10 నెలల వ్యవధిలో మెగా డీఎస్సీని ప్రకటించి.. 11 వేల 062 టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేసింది. 10 వేల 6 మంది ఉద్యోగాల్లో చేరారు. గురుకులాల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు కలిపి మొత్తం.. 8 వేల 304 మందికి నియామక పత్రాలను అందించామని ప్రభుత్వం వెల్లడించింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి గందరగోళంగా ఉన్న గ్రూప్‌ 1 పరీక్షను రద్దుచేసి.. 563 పోస్టులతో కొత్త నియామక ప్రకటన వెలువరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తిచేసినట్టు స్పష్టం చేసింది. గ్రూప్‌-3 పరీక్షలను కూడా త్వరలో నిర్వహించామని.. డిసెంబరు 15, 16 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రేవంత్ సర్కారు వివరించింది. ఇటీవలే గ్రూప్‌-4 ఫలితాలను కూడా టీజీపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 8 వేల 143 మంది అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

పోలీసు నియామక బోర్డు ద్వారా 16 వేల 67 మందికి నియామక పత్రాలు అందించారు. మెడికల్‌ నియామక బోర్డు కింద 7 వేల 94 మంది స్టాఫ్‌ నర్సు నియామకాలు పూర్తి చేశారు. ఇటీవల 1,284 ల్యాబ్‌ టెక్నీషియన్, 2 వేల 50 నర్సింగ్‌ అధికారులు, 633 ఫార్మాసిస్టు పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ బోర్డు పరిధిలో 5 వేల 378 పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

ఏ బోర్డు ద్వారా ఎన్ని ఉద్యోగాలు..

అత్యధికంగా పోలీస్ నియామక బోర్డు ద్వారా 16 వేల 67 ఉద్యోగాలు భర్తీ చేశారు.

పాఠశాల విద్య, డీఎస్సీ ద్వారా 10 వేల 6 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.

గురుకుల నియామక బోర్డు ద్వారా 8 వేల 304 పోస్టులను భర్తీ చేశారు.

మెడికల్ నియామక బోర్డు ద్వారా 6 వేల 956 పోస్టులను భర్తీ చేశారు.

గ్రూప్-4 ద్వారా 8 వేల 143 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

టీజీపీఎస్సీ ద్వారా 3 వేల 393 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.

ఇతర సంస్థల ద్వారా 441 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇలా వివిధ సంస్థల ద్వారా మొత్తం 53 వేల 310 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Whats_app_banner