PM Modi On HCU Lands : అడవులపైకి బుల్డోజర్లు ఇదే కాంగ్రెస్ మోడల్, కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు-congress government busy sending bulldozers to forests pm modi key comments on hcu lands ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pm Modi On Hcu Lands : అడవులపైకి బుల్డోజర్లు ఇదే కాంగ్రెస్ మోడల్, కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi On HCU Lands : అడవులపైకి బుల్డోజర్లు ఇదే కాంగ్రెస్ మోడల్, కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi On HCU Lands : హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని కాంగ్రెస్ పాలనలో భాగమని వ్యాఖ్యానించారు. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీ ఉందన్నారు.

అడవులపైకి బుల్డోజర్లు ఇదే కాంగ్రెస్ మోడల్, కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi On HCU Lands : హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అడవులను ధ్వంసం చేస్తోందని ప్రధాని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల అంశం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తాజాగా ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ హరియాణా పర్యటనలో స్పందించారు. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్‌ సర్కార్ బిజీగా ఉందని విమర్శించారు. ప్రకృతిని నాశనం చేయడం, వన్యప్రాణులకు హాని కలిగించడం కాంగ్రెస్‌ పాలనని వ్యాఖ్యానించారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. ఇచ్చిన హామీలను సైతం కాంగ్రెస్‌ మర్చిపోయిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

వారిది కుర్చీ కోసమే ఆరాటం

"తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది. కాంగ్రెస్ సర్కార్ అడవులపై బుల్డోజర్లు పంపడంతో బిజీగా ఉంది. ప్రకృతికి నష్టం, జంతువులకు హాని ఇదే కాంగ్రెస్ కార్యాచరణ. మనం ఇక్కడ చెత్త నుంచి గోబర్ గ్యాస్ ఏర్పాటు చేస్తుంటే, అక్కడ వాళ్లు ఉన్న అడవులను నాశనం చేస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని నడిపించే రెండు మోడల్స్ మీ ముందున్నాయి. ఒక వైపు కాంగ్రెస్ మోడల్ ఉంది. అది పూర్తిగా అబద్ధం అని అర్థమైపోయింది. వారిలో కుర్చీ కోసమే ఆలోచన ఉంది. మరోవైపు బీజేపీ మోడల్ ఉంది. సత్యం ఆధారంగా ఈ మోడల్ నడుస్తోంది. బాబా సాహెబ్ అంబేడ్కర్ చూపించిన దిశలో సాగుతోంది. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ముందుకెళ్తుంది. వికసిత్ భారత్ నిర్మించడానికి కలలు కంటోంది" -ప్రధాని మోదీ

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ అఫిడవిట్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ అఫిడవిట్ లో కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భూముల్లోనే సెంట్రల్ యూనివర్సిటీ, ఇతర ఇనిస్టిట్యూట్‌లు, బస్ స్టాండులు ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరించింది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం కోర్టు వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిచి, అటవీ ప్రాంతంగా మారిందని అఫిడవిట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం వ్యవహారం వివాదం కావడంతో సీఎస్ శాంతికుమారి గత రెండు రోజులుగా దిల్లీలోనే ఉండి సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. అనంతరం ఈ అఫిడవిట్‌ను సిద్ధం చేశారు. దీనిని సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం