Congress Protests :స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు, భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు - కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం
Congress Protests : అసెంబ్లీ స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్లపైకి వచ్చి కేటీఆర్, జగదీశ్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు.
Congress Protests : అసెంబ్లీలో స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ఆందోళనకు దిగారు. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్ నిరసన ఆందోళనను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు పలువురి అరెస్టు చేయడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
అధికార పార్టీ కాంగ్రెస్ రోడ్డెక్కింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన ఆందోళన దిగి, కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. కరీంనగర్ లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు.
కేసీఆర్ కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్, నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి రజితారెడ్డి తదితరులు పాల్గొని స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు తమ తీరు మార్చుకోకుంటే అసెంబ్లీలో శాశ్వతంగా ఉండకుండా చేస్తామని, తరిమి కొట్టక తప్పదన్నారు. ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోసేస్తామని హెచ్చరించారు.
సిరిసిల్ల లో ఉద్రిక్తత.... పలువురిని అరెస్ట్..
సిరిసిల్లలో కాంగ్రెస్ ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండు వర్గాలు అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు.
బలవంతంగా లాక్కెళ్ళి పోలీస్ హెడ్ క్వార్టర్ కు తరలించారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ నాయకులు నిరసించారు. బీఆర్ఎస్ నేతల అరెస్టు అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు అంబేడ్కర్ చౌరస్తాలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పై జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దళిత ద్రోహుల పార్టీ బీఆర్ఎస్
పీసీసీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి బొమ్మలు దహనం చేశారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి బీఆర్ఎస్ అంటేనే దళితుల ద్రోహి పార్టీ అని ఆరోపించారు.
దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ఓర్వలేక అసెంబ్లీలో స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాలని విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు వైఖరి మార్చుకొని స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్ఎస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం