Janwada Farm House Row : కేటీఆర్‌ డ్రగ్‌ టెస్టు చేయించుకోవాలి.. కాంగ్రెస్ డిమాండ్!-congress demands that brs working president ktr undergo drug test ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Janwada Farm House Row : కేటీఆర్‌ డ్రగ్‌ టెస్టు చేయించుకోవాలి.. కాంగ్రెస్ డిమాండ్!

Janwada Farm House Row : కేటీఆర్‌ డ్రగ్‌ టెస్టు చేయించుకోవాలి.. కాంగ్రెస్ డిమాండ్!

Janwada Farm House Row : జన్వాడ ఫామ్‌హౌస్‌ పార్టీ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారుతోంది. ఇది కేటీఆర్ మెడకు చుట్టుకుంటోంది. అధికార కాంగ్రెస్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తోంది. తాజా కాంగ్రెస్ షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్‌

జన్వాడ ఫామ్‌హౌస్‌ పార్టీ వ్యవహరం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఇష్యూలో ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ అయ్యారు. కాంగ్రెస్ కేటీఆర్‌‍ను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా.. ఈ వ్యవహారంపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

'కేటీఆర్‌ డ్రగ్‌ టెస్టు చేయించుకోవాలి. డ్రగ్స్‌ అనగానే కేటీఆర్‌ ఎందుకు స్పందిస్తున్నారు. జన్వాడ ఫాంహౌస్‌కు విదేశీ మద్యం ఎలా వచ్చింది. కేటీఆర్‌ బావమరిది పేకాట ఆడుతూ.. డ్రగ్స్‌ తీసుకుని అడ్డంగా దొరికిపోయాడు. కేసీఆర్‌ కుటుంబానికి వేల కోట్లు ఎలా వచ్చాయి. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలి. జన్వాడ ఫాంహౌస్‌పై వాస్తవాలు చూపించినందుకు.. గతంలో రేవంత్‌రెడ్డిని 40 రోజులు జైల్లో పెట్టారు' అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.

'జైల్లోనే రేవంత్‌రెడ్డిని చంపాలని చూశారు. ప్రతివారం రాజ్ పాకాల రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతోనే పోలీసులు దాడులు చేశారు. త్వరలో వాస్తవాలను ప్రజలు ముందు పెడతాం. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారు. పోలీసులు వారి పని వారు చేస్తున్నారు. దీంట్లో బీఆర్ఎస్‌కు ఇబ్బంది ఏంటీ' అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

జన్వాడ ఫామ్‌హౌస్‌ పార్టీ ఘటనపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 'ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ లేకుండా విందులు చేసుకోండి. విదేశీ మద్యం వాడతారు.. కానీ అనుమతులు మాత్రం తీసుకోరు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నిందలు వేస్తున్నారు. సీఎం రేవంత్‌ కక్ష సాధింపు అనడం సరికాదు' అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంపై పొలిటికల్ పంచ్‌లు పేలుతున్న సమయంలో.. కీలక పరిణామం జరిగింది. తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు రాజ్‌ పాకాల. లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. అక్రమ అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. హైకోర్టును ఆశ్రయించారు రాజ్‌ పాకాల.

రాజ్‌ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ.. జన్వాడ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే రాజ్‌ పాకాల, విజయ్‌ మద్దూరిపై కేసు నమోదు చేశారు. సోమవారం విజయ్‌ మద్దూరిని మరోసారి విచారించే ఛాన్స్ ఉంది. రాజ్‌ పాకాల డ్రగ్స్‌ తీసుకోమంటేనే తీసుకున్నానని.. విజయ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే.. పోలీసుల స్టేట్‌మెంట్‌ను ఖండించారు విజయ్‌ మద్దూరి. అటు రాజ్‌ పాకాలకు డ్రగ్స్‌ ఎక్కడిదనే కోణంలో విచారణ జరుపుతున్నారు హైదరాబాద్ పోలీసులు.