KTR Comments: కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే...నక్కలా జనాన్ని మోసం చేశాయన్న కేటీఆర్-congress bjp are same ktr says that they deceived the people like jackals ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Comments: కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే...నక్కలా జనాన్ని మోసం చేశాయన్న కేటీఆర్

KTR Comments: కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే...నక్కలా జనాన్ని మోసం చేశాయన్న కేటీఆర్

HT Telugu Desk HT Telugu

KTR Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నక్క కథ చెప్పారు. దేవుడు పంపించిన నక్కనని కాంగ్రెస్‌ పార్టీ రంగులేసుకుని నాటక మాడిందన్నారు. నిజమేనని నమ్మిన వారు నక్క చెప్పినట్లు విన్నారని తెలిపారు. ఓ రోజు రాళ్ళ వర్షం కురయడంతో నక్క రంగు బయటపడడంతో జనం తరిమితరిమి కొట్టారని ఎద్దేవా చేశారు.

టీఆర్‌ఎస్‌ రజతోత్సవాలకు సన్నాహాలు

KTR Comments: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఒకే రకంగా ఉందని ఆ రెండు పార్టీలు దొందు దొందేనని కేటీఆర్‌ విమర్శించారు.టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 27న వరంగల్ లో నిర్వహించే రజతోత్సవ సభపై కరీంనగర్ లో కేటిఆర్ టిఆర్ఎస్ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై కరీంనగర్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వి కన్వెన్షన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ తోపాటు ఎమ్మెల్యే లు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీరు బిజెపి వైఖరిపై ఫైర్ అయ్యారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు దొందూ దొందే.. రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు శత్రువులేనని కేటిఆర్ ఆరోపించారు. రూ. 15 లక్షలు జన్‌ధన్ ఖాతాల్లో వేస్తామని మోడీ మాట ఇచ్చి మోసం చేసిండని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 11 సంవత్సరాలలో మోడీ చేసిందేమీ లేదన్నారు. 1998 కాకినాడ తీర్మానంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్ తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టేనని ఆరోపించారు. తెలంగాణలో ఏ ఊరికి పోయినా రైతు కళ్ళల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే కాంగ్రెస్ వచ్చినంక బతుకు ఆగమైందంటున్నారని చెప్పారు.

సీఎం కుర్చీ లో దొంగ కూర్చున్నాడు.... కేటీఆర్

ముఖ్యమంత్రి కుర్చీలో ఓ దొంగ కూర్చున్నాడని ఘాటుగా విమర్శించారు కేటిఆర్. ఇవాళ దొర పోయి దొంగ వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పేం లేదు. చేసిన పని చెప్పుకోవడంలో విఫలమయ్యారన్నారు. మోసపోతే గోస పడతామని కేసీఆర్ చెప్పిన మాటను జనాల్లోకి తీసుకపోవడంలో ఫెయిల్ అయినం కాబట్టే అధికారం కోల్పోయామని తెలిపారు.

కేసీఆర్ మీద ద్వేషం నింపి జనాల మనసు మార్చారని తెలిపారు.‌ తెలంగాణ ప్రజల బాగు కోసం బీఆర్ఎస్ మళ్లీ గెలవడం చారిత్రక అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 27 న జరిగే వరంగల్ సభకు లక్షలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడుతున్న సన్నాసుల నోళ్లు మూతలు పడేలా చేయాలని కోరారు. అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ.. ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో 15 నెలల నుంచి బీఆర్ఎస్ చూపిస్తోందని తెలిపారు.

భూమికి జానెడు లేని వాళ్ళు....

భూమికి జానెడు లేనివాళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ చిత్తశుద్ధిని శంకిస్తున్నారని కేటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.‌ కాలం బాలేనప్పుడు వానపాములు కూడా నాగుపాముల లెక్క బుసకొడతాయని, గ్రామ సింహాలు కూడా నిజమైన సింహాల లెక్క గర్జిస్తాయి చూడాలి తప్పదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం, అణిచివేతల రాజ్యమని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా తిరిగి రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం... ఊరుకునే ప్రసక్తే లేదని ఇదివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క అని స్పష్టం చేశారు.

కు.ని.తో అన్యాయం....

భారత ప్రభుత్వం చెప్పినట్టు కుటుంబ నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్‌‌తో తీవ్ర అన్యాయం జరగబోతుందన్నారు కేటిఆర్. జనాభా తగ్గిన దగ్గర ఎంపీ సీట్లు తగ్గిస్తామని మోడీ అంటున్నాడని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో జనాభా ఎక్కువగా ఉందని, అక్కడ ఎంపీ సీట్లు పెంచుతామని మోడీ మన మెడ మీద డీలిమిటేషన్ కత్తి పెట్టిండని చెప్పారు.

తెలంగాణకు మోడీ ఏం చేసిండో చెప్పమంటే బండి సంజయ్ శివం శవం తప్ప ఏం చెప్పలేడని విమర్శించారు. ఒక బడి తేలేదు.. ఒక గుడి కట్టలేదు.. గుడికట్టినా.. బడి కట్టినా.. కరీంనగర్‌కు మెడికల్ కాలేజ్ తెచ్చినా.. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా డెవలప్ చేసిన అది బీఆర్ఎస్ ఘనతేనని స్పష్టం చేశారు.

త్వరలో శిక్షణ తరగతులు...

జిల్లా పార్టీ ఆఫీసుల్లో కార్యకర్తలకు నాయకులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని కేటిఆర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవడానికి మేమంతా కష్టపడతామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13కు 13 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలని కోరారు. కేసీఆర్ టికెట్ ఎవరికీ ఇచ్చినా కార్యకర్తలు అంతా అతని గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. క్యాండిడేట్ ఎవరైనా కొట్లాడేది కేసీఆర్ కోసమే....కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రతి ఒక్క కార్యకర్త శపథం చేయాలని కేటిఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

HT Telugu Desk

సంబంధిత కథనం